భీమవరం టౌన్: పెళ్లిరోజునే.. మరణ ముహూర్తంగా లిఖించుకున్నాడు ఆ వృద్ధుడు. భార్య మరణించి 16 ఏళ్లు గడిచాయి. ముగ్గురు పిల్లలు ఉన్నా దూరంగా ఉండాల్సి రావడంతో ఆ వృద్ధుడు అందరూ ఉన్నా ఒంటరి వాడయ్యాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ మనసులోనే బాధను భరిస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆ ముదుసలి.. ఈ జీవితం ఇక చాలనుకున్నాడో ఏమో సొంతింట్లోనే అగ్నికి ఆహుతయ్యాడు. బుధవారం ఉదయం భీమవరంలో ఈ ఘటన జరిగింది. జగన్నాథ రథయాత్రకు నడిచి వెళ్లాలని ఉందని ముందురోజే తన సోదరుడికి చెప్పి వస్తూ మావుళ్లమ్మ ఉత్సవాలను చూసి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఆ వృద్ధుడు మృత్యువును ఆహ్వానించడం అందరినీ కలచివేసింది. పిల్లలను పెంచి పెద్దచేసి ఒకదారి చూపడమే జీవిత పరమార్థంగా భావించే తల్లిదండ్రులకు వయో భారంలో తోడు నీడ లేక.. అయిన వారికి భారంగా మిగల లేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ వృద్ధుడు ఇదే నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
భీమవరం భీమేశ్వరస్వామి గుడి ఎదురుగా ఉన్న ఆకుల వారి వీధిలోని మేడపై భాగంలో నివాసం ఉంటున్న తటవర్తి సూర్యనారాయణ(72) బుధవారం ఉదయం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటల బాధను తట్టుకోలేక కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక అధికారి ఎస్‌కే జాన్ అహ్మద్, సిబ్బంది ఇంటి పై పోర్షన్‌కు చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే వన్‌టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్సై ఎస్.సత్యసాయి, పోలీస్ సిబ్బంది అక్కడ విచారణ చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె, కుమారుడు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా మరో కుమార్తె అత్తిలిలో ఉంటోంది. విషయాన్ని అత్తిలిలో ఉంటున్న కుమార్తెకు స్థానికులు సమాచారం అందించడంతో ఆమె నర్సయ్య అగ్రహారంలో ఉంటున్న మృతుని సోదరుడు తటవర్తి శేషావతారానికి ఫోన్లో విషయం తెలిపింది.
శేషావతారం ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతుడు పూర్తిగా కాలిపోయి మంచంపై పడి ఉన్నాడు. మంగళవారం నర్సయ్య అగ్రహారంలోని తన ఇంటికి సూర్యనారాయణ వచ్చాడని, బద్రీనాథ్ యాత్రకు నడిచి వెళ్లాలని ఉందని చెప్పాడన్నారు. తాము ఐదుగురు సంతానమని అందులో పెద్దవాడు సూర్యనారాయణ అని, ఇలా జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదని శేషావతారం చెప్పారు. అన్నయ్య సూర్యనారాయణ పెళ్లిరోజునే ఇలా చేసుకోవడం ఎంతో బాధను కలిగిస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో పెద్ద తిరుపతి, భద్రాచలం నడిచి వెళ్లాడని, అలాగే జగన్నాథ రథయాత్రకు వెళ్లాలని కోరికను వ్యక్తం చేశాడని, తరువాత తన వద్ద నుంచి మావుళ్లమ్మ ఉత్సవాలకు వెళతానని చెప్పి బయల్దేరి వెళ్లాడన్నారు. ఉదయమే ఈ విషాదవార్త వినాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న ముగ్గురు పిల్లలు ఇక్కడికి చేరుకున్నారు. ఒంటరితనం, జీవితంపై విరక్తి ఇతర కారణాలతో కిరోసిన్ లేదా పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని సూర్యనారాయణ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని ఎస్సై సత్యసాయి తెలిపారు. తటవర్తి శేషావతరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment