నిందితుల వివరాలు తెలుపుతున్న సీఐ నర్సింహారెడ్డి
తలకొండపల్లి(కల్వకుర్తి): బావిలో పడి వృద్ధురాలు మరణించిన కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని వృద్ధురాలిని బావిలోకి తోసి చంపేశారని సీఐ నర్సింహారెడ్డి చెప్పారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పడకల్ గ్రామానికి చెందిన చెవిటి మైసమ్మ (66) వృద్ధురాలు జనవరి 14న గ్రామ శివారు ప్రాంతంలోని బావిలో పడి మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య చేసినట్లుగా వెల్లడైంది.
పడకల్ గ్రామానికి చెందిన బురిగళ్ల దుర్గయ్య, బురిగళ్ల సంతోష వరుసకు వదిన, మర్దిలు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. మైసమ్మ ఇంటి సమీపంలోనే సంతోష ఇల్లు ఉంది. దీంతో దుర్గయ్య తరచూ సంతోష ఇంటికి వస్తుండేవాడు. విషయం గమనించిన మైసమ్మ మంచి పద్ధతి కాదని ఇరువురిని మందలించింది. వీరి మధ్య తరచుగా వాగ్వాదం కొనసాగుతుండేది. మృతురాలు మైసమ్మ అడ్డు తొలగించుకోవాలని దుర్గయ్య, సంతోషలు పథకం పన్నారు. ఇదిలా ఉండగా సంతోష బంగారు నగలు కొనివ్వమని తన ప్రియుడైన దుర్గయ్యను అడుగుతుండేది. దీంతో దుర్గయ్యకు ఒంటరిగా ఉన్న మైసమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది. మైసమ్మను చంపి ఆభరణాలను తస్కరించి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మైసమ్మ అడ్డుతో పాటు, బంగారు ఆభరణాలు సొంతం అవుతాయని, ఈ విషయాన్ని సంతోషకు చెప్పాగా ఆమె హత్యచేసేందుకు అంగీకరించింది.
నగలు వస్తాయి.. అడ్డు తొలగుతుందని..
పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. జనవరి 9వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో దుర్గయ్య, సంతోష ఇద్దరూ కలిసి మైసమ్మ ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మైసమ్మ గొంతు నులిమి చంపేశారు. మైసమ్మ ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్‌ఫోన్‌ను దొంగలించారు. సాక్ష్యం దొరక్కుండా మృతదేహాన్ని గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న పాడుబడిన బావిలో పడేశారు. 14వ తేదీన గ్రామస్తులు బావిలో తేలాడుతున్న మైసమ్మ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పదస్థితి మృతి కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు దుర్గయ్య, సంతోషలను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసుల సహకారంతో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు నిందితులు దుర్గయ్య, సంతోషలను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్‌యాదవ్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment