సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుల దురహంకారంతో తన కూతురు భర్త ప్రణయ్‌ను కడతేర్చేందుకు అమృత తండ్రి మారుతీరావు రూ.కోటి డీల్ కుదుర్చుకున్నాడా..? కిరాయి హంతకులకు రూ.50 లక్షలు అడ్వాన్స్ అప్పజెప్పాడా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ‘పరువు హత్య ’కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం గిట్టని ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఆ దిశలో విచారణ జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నేరుగా ఒకే గ్యాంగ్‌తో సంబంధాలు పెట్టుకోకుండా ఈ హత్యను పకడ్బందీగా చేసేందుకు మూడంచెల గ్యాంగ్‌ను మాట్లాడుకున్నారని తెలిసింది.
పని పూర్తిచేస్తే రూ. కోటి ముట్టచెబుతామని మాట ఖరారు చేసుకున్నారని, అడ్వాన్సుగా రూ.50 లక్షలు చెల్లించారని చెబుతున్నారు. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఈ గ్యాంగ్ కనీసం రెండు నెలలుగా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటిపై నిఘా పెట్టిందని, రెక్కీ చేసిందని చెబుతున్నారు. అనధికారిక సమాచారం మేరకు హత్య జరిగిన శుక్రవారం మిర్యాలగూడ ప్రాంతంలోని బ్యాంకుల్లో మారుతీరావు అకౌంట్ల నుంచి కనీసం రూ.1.5 కోట్ల లావాదేవీలు జరిగాయని సమాచారం. కాగా, పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మూడు గ్యాంగులు ఇందులో పాల్గొన్నాయి. శుక్రవారం సాయంత్రానికే నిందితుడిని నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
హంతకులకు మారుతీరావు షెల్టర్
మారుతీరావు తన అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నాడని, ఆ గ్యాంగ్ హత్యకు మూడు రోజుల ముందరే పట్టణానికి చేరుకుందని, వారికి మారుతీరావే షెల్టర్ కల్పించారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన కూతురు ఆస్పత్రికి వచ్చిన విషయాన్ని మారుతీరావు ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడని చెబుతున్నారు. మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరిగే సమయానికి ప్రధాన నిందితుడు మారుతీరావు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాడని, ఒక పనికోసం ఉన్నతాధికారులను కలిసేందుకు నల్లగొండకు వచ్చాడని సమాచారం. హత్య జరిగిన తర్వాత ఫోన్ రావడంతో ఆయన కలెక్టరేట్ నుంచి వెళ్లిపోయాడని, అయితే ఎటుపోవాలో పాలుపోక జాతీయ రహదారిపై చక్కర్లు కొట్టాడని, కేతేపల్లి, కట్టంగూరు తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నల్లగొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న మారుతీరావు విచారణ అధికారుల ఎదుట నోరు విప్పినట్లు తెలుస్తోంది.
కూతురి కన్నా పరువే ముఖ్యం!
పోలీసుల అదుపులో ఉన్న మారుతీరావు తన కూతురిపై ఉన్న ప్రేమతోనే ఈ హత్య చేయించినట్లు చెబుతున్నాడని తెలిసింది. ‘నా కూతురిపై ప్రేమతోనే ప్రణయ్‌ని చంపించా. 9వ తరగతిలోనే ప్రణయ్, అమృతలకు వార్నింగ్ ఇచ్చా. ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు. నాకు నా కూతురు కన్నా సొసైటీలో నా పరువే ముఖ్యం అనుకున్నా. సుపారీ గ్యాంగ్‌కి నా కూతురికి ఎటువంటి హాని తలపెట్టొద్దని ముందుగానే చెప్పా. ప్రణయ్‌ని చంపించినందుకు నాకేం బాధ లేదు. జైలుకి వెళ్లడానికి సిద్ధపడే ఈ ప్లాన్ వేశా..’అని నిందితుడు మారుతీరావు పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కొందరు పోలీసు అధికారులు మాత్రం అసలు ఆయన నోరే విప్పడం లేదని కూడా చెబుతున్నారు.
మారుతీరావుది ‘ఘన’మైన చరిత్రే!
కూతురి భర్తను అతి కిరాతకంగా కిరాయి హంతకులతో చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు వ్యక్తిగత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులతో సన్నిహితంగా ఉండే మారుతీరావు రెవెన్యూ, పోలీసు అధికారులనూ గుప్పిట పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్‌గా జీవితం మొదలు పెట్టిన మారుతీరావు, కొందరు రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారి అండదండలతో భూ దందాలు సాగించాడన్న ఆరోపణలు ఉన్నాయి. భూ దందాల కోసం అధికారులను లోబర్చుకోవడం.. వారి సరదాలు తీర్చి పనులు చేయించుకునే వాడని అంటున్నారు. ఆర్యవైశ్య, రైస్‌మిల్లర్స్ మధ్య తలెత్తే పంచాయితీలు సెటిల్ చేసేవాడని సమాచారం. రాజకీయ నేతలు, కొందరు కుల సంఘాల నాయకుల అవసరాలు తీరుస్తూ వారిని తనకు అనుకూలంగా మలచుకుని తన అక్రమ దందాలకు వాడుకునే వాడని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే టీఆర్‌ఎస్‌లో చేరాడని, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కేబుల్, బెల్లం వ్యాపారం సాగించేవాడని తెలుస్తోంది.
విచారణ సాగుతోంది
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను సవాల్‌గా తీసుకుని జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. హతుడి భార్య అమృత ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. అమృతకు ఎలాంటి ప్రాణభయం లేదని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుంటే హోమ్‌కు తరలిస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండు మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని, కేసు విచారణలో ఉండగా ప్రస్తుతం అన్ని వివరాలు బయటపెట్టలేమని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment