
తమ ప్రాణాలను పణంగా పెట్టి అతివేగంతో వారు ఆడిన ఆట తమలో ఒకడిని మృత్యుఒడికి చేర్చింది.. పుట్టిన రోజు సంబరాలు వారిలో ఒకరి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అతివేగం ప్రమాదకరం, నిదానమే ముద్దు.. వేగం వద్దు అంటూ ప్రభుత్వం, అధికారులు ఎంత ప్రచారం చేస్తున్నా.. యువత వినడం లేదు. వేగంలోనే మజా ఉందంటూ, స్పీడ్ బైక్‌లపై రయ్యని దూసుకుపోతూ మృత్యు ఒడికి చేరుతున్నారు. రామవరప్పాడు సమీపంలో బుధవారం జరిగిన బైక్ రేసింగ్ ఒకరి కుటుంబంలో విషాదం నింపింది..
సాక్షి, ఆటోనగర్(విజయవాడతూర్పు), రామవరప్పాడు: అతివేగం ఒకరిపాలిట యమపాశం అయింది. రామవరప్పాడు సమీపంలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తవంతెన దుర్గా అగ్రహారానికి చెందిన బుర్ర అజయ్(19), దోమల యశ్వంత్(22), వాంబేకాలనీకి చెందిన గుత్తికొండ నాగరాజు(23), కుందావారి కండ్రికకకు చెందిన వందల దుర్గాప్రసాద్(23) నలుగురు స్నేహితులు. వీరిలో దుర్గాప్రసాద్ పుట్టినరోజు కావడంతో మిత్రులంతా కలిసి ద్విచక్ర వాహనంపై ఎనికేపాడు వరకూ వెళ్లి వేడుక జరుపుకొన్నారు. తిరిగి విజయవాడకు బయల్దేరుతూ ఎవరు ముందు వెళ్తారోనని పందెం వేసుకొని ఒకరినొకరు అతివేగంతో రెండు వాహనాలపై వచ్చేస్తున్నారు.
ఈ క్రమంలో రామవరప్పాడు సమీపంలోకి వస్తుండగా ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న పిచ్చయ్య హోటల్ వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఘటనలో నలుగురు కింద పడ్డారు. అజయ్ డివైడర్ ఇనుపచువ్వలు బలంగా గుచ్చుకుని, అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్‌చేసి సమాచారం అందించగా వారు వచ్చి క్షతగాత్రులందరికి చికిత్సనిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అజయ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment