బాధితుడు లక్ష్మీనారాయణ
ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): జిల్లాకు చెందిన మరో వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బ్యాంకర్ల పేరు ఖాతా, ఏటీఎం వివరాలు తెలుసుకుని, బాధితుడి ఖాతా నుంచి రూ.38 వేలు కొల్లగొట్టారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు సోమవారం సాయంత్రం దుండగులు ఫోన్ చేశారు. ‘హలో లక్ష్మీనారాయణ.. మేము ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు ఎక్స్‌పైరీ అయింది. ఆ కార్డు వివరాలు ఇవ్వండి.. మళ్లీ ఓపెన్ చేస్తామని’ హిందీలో చెప్పాడు.
దీంతో తాను పొలం వద్ద ఉన్నానని, తన కుమారుడు ప్రణీత్‌తో మాట్లాడాలన్న లక్ష్మీనారాయణ అతడికి ఫోన్ కాన్ఫరెన్స్ కలిపాడు. ఇదేమి తెలియని ప్రణీత్ దుండగులు అడిగిన వివరాలన్ని చెప్పేశాడు. ఏటీఎం కార్డుపై 16 నెంబర్లతో పాటు సీవీవీ, పిన్ నెంబర్ తీసుకున్న దుండగులు.. క్షణాల్లో ఆ ఖాతా నుంచి రూ.38 వేలను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశారు.
అయితే, ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో బాధితుడు మంగళవారం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి విషయం చెప్పాడు. ఆన్‌లైన్ షాపింగ్‌తో నీ డబ్బులు డ్రా అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బాధితుడు లబోదిబోన్నాడు. ఈ ఘటనపై బ్యాంక్ అధికారులతో పాటు ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కోలకతా నుంచి ఫోన్..
లక్ష్మీనారాయణకు వచ్చిన ఫోన్ నంబర్ ద్వారా కోల్‌కతా నుంచి చేసినట్లు గుర్తించారు. బాధితుడు తిరిగి మంగళవారం అదే నెంబర్‌కు ఫోన్ చేయగా, తాను రాహుల్‌గాంధీని అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అరగంట తరువాత ఫోన్ చేయగా.. ‘అవును నీ ఏటీఎం నుంచి రూ.38 వేలు డ్రా చేశాను. ఇలా ఇప్పటివరకు రూ.25 లక్షలు డ్రా చేశా. ఏమి చేస్తావో చేసుకో’ అని దుండగుడు బదులిచ్చాడు. సైబర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెబితే, చెప్పుకో నాక్కూడా పోలీసులు ఉన్నారని ఫోన్ పెట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment