
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని ఓ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వికృతచర్యకు పాల్పడ్డారు. ఏ మాత్రం జాలి లేకుండా మూర్ఖంగా, అనాగరికంగా వ్యవహరించారు. ఓ కోవాలా(ఎలుగు బంటి రూపంలో ఉండే చిన్న ప్రాణి. ఉడుతలకుండే జుట్టు మాదిరిగా వీటి జుట్టు ఉంటుంది)ని చంపడమే కాకుండా కర్కశంగా దానిని ఓ పోల్‌కు శీలలతో బిగించారు. దీనిపై ఆస్ట్రేలియాలోని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా కోవాలా రెస్క్యూ క్వీన్‌లాండ్(కేఆర్‌క్యూ) దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. బ్రిస్బేన్‌కు 175 కిలోమీటర్ల దూరంలోని జింపీకి సమీపంలో బ్రూలూ పార్క్ లుకౌట్ అనే పార్క్ ఉంది. అక్కడో పిక్‌నిక్ సెంటర్ కూడా కలదు. అయితే, అక్కడి చెట్లు, స్తంబాలను కోవాలు సరదాగా అప్పుడప్పుడు ఎక్కుతుంటాయి.
అయితే, తొలుత అంతా అది పోల్‌పై ఎక్కిందని అనుకున్నారు. కానీ, స్పష్టంగా పరిశీలించగా దానిని చంపి పోల్‌కు స్క్రూలతో బిగించి పెట్టారని గుర్తించారు. దీనిపై కేఆర్‌క్యూ అధికారులు స్పందిస్తూ 'ఇప్పటి వరకు తుపాకులను ఉపయోగించి కోవాలాను కొంతమంది దుండగులు చంపడం చూశాం. కానీ, ఈ కోవాలాను చంపిన వారు అసలు మనుషులే కాదు. ఇలా జరగడం తొలిసారి. సమాజం ఎంత చెడుగా మారుతుందో ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. ఈ సంఘటన చూస్తేనే మనసు చివుక్కుమంటోంది' అంటూ వ్యాఖ్యానించారు. కాగా, దానిని అంతక్రూరంగా చంపినవారిని అరెస్టు చేసి అంతకంటే క్రూరమైన శిక్ష వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోవాలాలకు గత కొంతకాలంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంతువులు ఆస్ట్రేలియాలో కంగారుల మాదిరిగానే ప్రత్యేకం.
Comments
Please login to add a commentAdd a comment