పెనుమంట్ర పంచాయతీరాజ్ కార్యాలయంలో దాడులు చేస్తున్న ఏసీబీ అధికారులు
పెనుమంట్ర : పెనుమంట్ర పంచాయతీరాజ్ డెప్యూటీ కార్యనిర్వహణాధికారి కె.రామకృష్ణపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేశారు. పెనుమంట్రలోని తన కార్యాలయంలో పెనుగొండ సర్పంచి యాదాల ఆశాజ్యోతి భర్త రవిచంద్ర నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారుల దాడి నిర్వహించి ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెనుగొండలో పంచాయతీ ఎన్‌ఆర్‌ఈజీయస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రహదారులకు డీఈ 5 శాతం కమీషన్ డిమాండ్ చేయగా రవిచంద్ర ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పథకం ప్రకారం డీఈకి కార్యాలయంలోనే సొమ్ములు ఇస్తుండగా అధికారులు దాడి జరిపారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌లు కె. శ్రీనివాసు, జె.విల్సన్‌లు తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితుడైన రవిచంద్ర మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో 10 శాతం కూలీల పేరిట సొమ్ములు వస్తాయని వారి నుంచి తిరిగి వసూలు చేసుకోవడం కష్టతరమన్నారు. అప్పటికే నష్టాల్లో ఉన్న రోడ్డు నిర్మాణదారుడిని అధికారులు ఇలా పర్సంటేజీల పేరుతో మరింత తీవ్రంగా హింసిస్తున్నారని వాపోయారు. ఇప్పటివరకు పెనుగొండలో నిర్మించిన పలు సిమెంట్ రహదారులను డీఈ తదితర అధికారులు ఇష్టారాజ్యంగా నిర్మించారని ఆయన విమర్శించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రవిచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్షేత్రస్థాయిలో దాడి జరిపామన్నారు. డీఈ రామకృష్ణ అక్రమాస్తులపైనా తణుకు శివారు సజ్జాపురం గ్రామంలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
డీఈ రామకృష్ణ నివాసంలో సోదాలు
తణుకు : అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పెనుమంట్ర పంచాయతీరాజ్ శాఖలో డీఈగా పనిచేస్తున్న కాళిదాసు రామకృష్ణ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.25 వేలు లంచం తీసుకుంటూ పెనుమంట్ర పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులకు డీఈ రామకృష్ణ పట్టుబడగా అదే సమయంలో తణుకులోని సజ్జాపురంలో ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు సంబంధించి బ్యాంకు ఖాతాలతో పాటు చర, స్థిరాస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment