రాయపాటి రాజమ్మ మృతదేహం, మాలకొండయ్య మృతదేహం
కడుపున పుట్టిన బిడ్డలే కన్నవారి పాలిట కాలయముళ్లయ్యారు. పున్నామనరకం నుంచి కాపాడాల్సిన వారే క్షణికావేశంలో కడతేర్చారు. ఒకరు తాను అడిగిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో అందరూ చూస్తుండగానే వృద్ధురాలైన తల్లి తలపై విచక్షణా రహింతంగా కట్టెతో మోది చంపగా.. మరొకరు తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంగా తండ్రిపై కర్రతో దాడిచేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు, సింగరాయకొండ మండలం మూలగుంటపాడుల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఒంగోలు/సింగరాయకొండ: ఒంగోలు మండలం ముక్తినూతలపాడులోని అరుంధతీనగర్‌కి చెందిన రాయపాటి రాజమ్మ(60), భర్తతో కలిసి చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు కాగా కుమార్తె ఇటీవల మరణించింది. దీంతో కొడుకు నాగరాజే వారికి ఆధారంగా మిగిలాడు. తాము కుమారుడికి భారం కాకూడదనే భావనతో వయసు మీదపడినా ఆ వృద్ధ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాజమ్మ ఇంట్లో టీవీకి కేబుల్ కనెక్షన్‌కు సంబంధించి సెట్‌టాప్ బాక్సు పెట్టించిన నాగరాజు ఇందుకు రూ.1000 చెల్లించాలంటూ బుధవారం ఉదయం తల్లిని డిమాండ్ చేశాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, కొద్దిరోజులు ఆగి ఇస్తానని చెప్పింది.
ఈ విషయంలో తల్లితో వాగ్వాదానికి దిగిన నాగరాజు ఆగ్రహంతో ఊగిపోతూ సమీపంలో కనిపించిన పెద్ద కట్టెను తీసుకొని ఆమె తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో రాజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నాగరాజును పట్టుకొని తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై రాజారావులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కట్టెను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగరాజు ముక్తినూతలపాడు హైవేమీద ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో హమాలీగా పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. అతనికి కోపం ఎక్కువని, ఆ మూర్ఖత్వమే కన్నతల్లి ప్రాణాలను హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి చేసి.. ప్రమాదంగా చిత్రించి..
సింగరాయకొండ మండలంలో మూలగుంటపాడు గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన లింగాబత్తిన మాలకొండయ్య(45) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలు మరచి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇతని ప్రవర్తనకు విసుగుచెందిన కొడుకు నరేష్ తల్లితో సహా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు వచ్చి కారు డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. తల్లి ఒక ప్రైవేటు ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటులో పనిచేస్తోంది. ఈ క్రమంలో నరేష్ ఒక ముస్లిం యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మాలకొండయ్య తరచూ భార్య దగ్గరకు వచ్చి వారితో గొడవపడుతూ ఉండేవాడు.
గర్భవతి అయిన నరేష్ భార్య ఇటీవల కందుకూరు ఏరియా ఆస్పత్రిలో బిడ్డను ప్రసవించింది. ఆ సమయంలో మాలకొండయ్య ఆస్పత్రిలో ఉన్న కోడలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె గత ఆదివారం తన భర్త నరేష్‌కు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేష్ అదేరోజు ఇంట్లో ఉన్న తండ్రిపై కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన తండ్రిని నరేష్ చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించాడు. వైద్యులకు మాత్రం తనతండ్రి ప్రమాదంలో గాయపడ్డాడని నమ్మబలికాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాలకొండయ్య మంగళవారం మృతి చెందాడు.
మృతదేహాన్ని స్వగ్రామమైన పోకూరుకు తీసుకెళ్లిన నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని బంధువులకు చెప్పాడు. మృతదేహంపై గాయాలను చూసి, ప్రమాదం కాదని భావించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోకూరు వీఆర్‌ఓ పొనుగోటి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు ఏరియా ఆస్పత్రిలో బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సీఐ ఆర్ దేవప్రభాకర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.నాగమల్లేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment