నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేస్తున్న సీఐ మల్లేష్ యాదవ్
వరంగల్ క్రైం : డమ్మీ పిస్తోల్‌తో ప్రజలను భయపెట్టి బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడిన నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాధ్ రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కేంద్ర కారాగారంలో జైలు జీవితం అనుభవిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చిత్తుపల్లి సీతారాములు అలియాస్ రాము అలియాస్ సంపత్ గతంలో మంగపేట, ఏటూరు నాగారం, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ప్రజలకు నకిలీ తుపాకీ చూపించి బంగారు ఆభరణాలదోపిడీకి పాల్పడ్డాడు. బంగారు ఆభరణాలతోపాటు ద్విచక్ర వాహనాలను తీసుకునేవాడు. ఆ వస్తువులను అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు. 2017లో ఏటూరునాగారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ క్రమంలో సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని బెదిరించి రూ.19 వేలు, ఒక ద్విచక్ర వాహనం అపహరించాడు. అనంతరం నిందితుడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చొరబడి ఒంటరి మహిళను బెదిరించి రూ.12 వేలు తీసుకున్నాడు. ఫిబ్రవరి 20న నిందితుడిని ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి రూ.11,500తో పాటు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దోపిడీకి పాల్పడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినందుకు రాముపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ వివరించారు.
నిందితుడికి ఉత్తర్వులు అందజేత
పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను ఆత్మకూరు సీఐ డి.మల్లేష్ యాదవ్ నిందితుడు రాముకి జైలర్ నర్సింహాస్వామి సమక్షంలో అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment