
సాక్షి, కరీంనగర్ : ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసిన కేసులో లింగంపల్లి కిషన్(42)కు జీవితఖైదుతోపాటు రూ.లక్షా 50వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం) ఎస్.శ్రీనివాస్‌రెడ్డి సంచనల తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన లింగంపల్లి కిషన్‌కు ఎల్‌కే బ్రిక్స్ ఇండస్ట్రీ ఉంది. అతడి వద్ద ఇటుక తయారీ పని కోసం ఓరిస్సా రాష్ట్రం బారాగౌడ్ జిల్లా బాయిడ్‌పల్లి గ్రామానికి చెందిన బలరాం సాహూ (55) భార్య, కూతురుతోపాటు వచ్చాడు.
వారితో పాటు ఒరిస్సాకు చెందిన దాదాపు 50మంది కిషన్ ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. బట్టీల వద్దే తాత్కాళిక గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. 2014 మార్చి 16న రాత్రి సాహూ అతడి భార్య గుడిసెలో నిద్రిస్తుండగా, కూతురు (16) బయట నిద్రిస్తోంది. అక్కడికి వచ్చిన కిషన్ బయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా తన ఆఫీస్‌కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. 2014 ఏప్రిల్ 14న ఇలాగే బయట నిద్రిస్తున్న మరో ఇద్దరు బాలికల(14), (11)ను ఆఫీస్‌కు తీసుకెళ్లి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈవిషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెళ్లి కిషన్‌ను నిలదీయగా, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో వారు ఒరిస్సాలోని బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు అక్కడి స్వచ్ఛంద సంఘాల వారితో కలిసివచ్చి 2014 ఏప్రిల్ 19న బాధితులతో చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై రియాజ్‌పాషా లింగంపల్లి కిషన్‌పై ఐపీసీ బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధర చట్టం, బాల కార్మిక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ టి.సత్యనారాయణ కేసు దర్యాప్తును ఏపీపీ వి.వెంకటేశ్వర్లు విచారించారు.
21మంది సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి సోమవారం నేరస్తుడైన కిషన్‌కు జీవితఖైదు, రూ.లక్షా 50వేలు జరిమానా విధించారు. జరిమానా డబ్బును బాధితులు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. తీర్పు నఖలు కాపీని జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు పంపించాలని, సంస్థ ద్వారా ప్రభుత్వం నుంచి బాధితులకు పరిహారం అందేలా చూడాలని తీర్పులో పేర్కొన్నారు. కిషన్ నడిపిస్తున్న ఇటుకబట్టి పరిశ్రమకు గ్రామపంచాయతీ, కార్మికశాఖ అనుమతులు లేవని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment