ఆందోళనకు దిగిన బంధువులకు నచ్చజెప్పుతున్న సీఐ, (ఇన్‌సెట్లో) లాడ్జి గదిలో గౌరీష్ మృతదేహం
రామభద్రపురం విజయనగరం : మండల కేంద్రంలోని శ్రీసాయి శ్రీనివాసా లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు అన్నయ్య మామిడి చినరాములు, అతని కుమారుడు రామకృష్ణ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. దత్తిరేజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మామిడి గౌరీష్ (48) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. దీంతో బంధువులు పరిసర గ్రామాలలో వెతికారు.
ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న సమయంలో రామభద్రపురం లాడ్జీలో చనిపోయి ఉన్నాడన్న సమాచారం వచ్చింది. దీంతో మృతుడి బంధువులు లాడ్జీకి చేరుకున్నారు. అయితే మృతదేహాన్ని చూసిన తర్వాత బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహాన్ని లాడ్జీ వెనుకనున్న మెట్ల గుండా ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకువచ్చినట్లుగా ఉంది.
మూడు రోజులుగా ఓ వ్యక్తి గదిలో ఉంటే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బంధువులు ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే గరీష్ చనిపోయాడని ఆరోపించారు. న్యాయం చేసేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లమని మృతుడి బంధువులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న సీఐ ఇలియాస్ అహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ పుటేజీ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. మృతుడి భార్య దయమంతి ఫిర్యాదు మేరకు యాజమాన్య ప్రతినిధులను అరెస్ట్ చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు పశువుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment