మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
పార్వతీపురం/ కొమరాడ: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుమడ, కూనేరు రైల్వేస్టేషన్ల మధ్య దేవుకోన రైల్వేగేట్ సమీపంలో గుర్తు తెలియని రైలు నుంచి వ్యక్తి జారిపడి ఉండడాన్ని కీమన్ సంతోష్ గమనించి వెంటనే గుమడ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెల్లుగాం పంచాయతీ బడాసాహి గ్రామానికి చెందిన సుదర్శన పాడి (60)గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి రైతు..
చీపురుపల్లి రూరల్: మండలంలోని జి.ములగాం గ్రామానికి చెందిన రైతు తోనంగి సూర్యనారాయణ (45) చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యనారాయణ తనకు ఉన్న రెండు ఆవులు, రెండు ఎద్దులను మంగళవారం ఉదయం మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రానికి రెండు ఆవులు, ఒక ఎద్దు ఇంటికి చేరుకున్నాయి. మరో ఎద్దు, సూర్యనారాయణ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సమీపంలో వెతికారు.
గ్రామానికి చెందిన నారప్ప చెరువులో ఒక ఎద్దు ఉండడం, మృతునికి చెందిన చెప్పులు, తువ్వాలు, లుంగీ, ఫోన్ అన్నీ కూడా చెరువు గట్టుపై ఉండడంతో చెరువులో గాలించగా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం మళ్లీ చెరువులో వెతకగా సూర్యనారాయణ మృతదేహం కనిపించింది. పశువులతో పాటుగా చెరువులో దిగిన సమయంలో పశువులకు కట్టిన తాళ్లు కాళ్ల మధ్యలో పడి సూర్యనారాయణ మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. సూర్యనారాయణ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుమారులను చదవిస్తున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment