బాల్క సుమన్‌ భార్య ఫొటో మార్ఫింగ్‌ | Photo morphing of MP Balka Suman wife | Sakshi
Sakshi News home page

బాల్క సుమన్‌ భార్య ఫొటో మార్ఫింగ్‌

Published Sat, Jul 7 2018 1:52 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Photo morphing of MP Balka Suman wife - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఫేస్‌బుక్‌లో ఉన్న ఎంపీ బాల్కసుమన్‌ భార్య ఫొటోను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. వీరు కొంతకాలంగా ఎంపీ సుమన్‌కు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. ఇవి కాస్త శృతిమించడంతో జనవరి 27న ఎంపీ మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఫిబ్రవరి 6న అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. పైగా సుమన్‌ తనను పెళ్లి చేసుకున్నారని సంధ్య అసత్య ప్రచారం ప్రారంభించింది.

ఈ క్రమంలో మే 31న హైదరాబాద్‌ నందీనగర్‌ లోని ఎంపీ ఇంటికి తన ఇద్దరు సోదరులు, సోదరితో కలసి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఎంపీ సహాయకుడు సునీల్‌ ఫిర్యాదు మేరకు జూన్‌ 7న బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నలుగురిపై కేసు నమోదు చేశారు. అయినా పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్‌బుక్‌లో సుమన్‌ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది.  

ఎంపీపై అసత్య ప్రచారం: సీఐ  
ఎంపీ సుమన్‌ మహిళలను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ మహేశ్‌ తెలిపారు. జనవరి 18న కేసు నమోదు చేసుకొని విచారించగా ఎంపీ సుమన్‌ తన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలను సంధ్య, విజేత కాపీ చేశారని, ఆయన భార్య స్థానంలో సంధ్య ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై 420, 292ఎ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కాచెల్లెళ్లు మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, చంద్రాపూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు, వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తేలిందని సీఐ వివరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాల్లో పెట్టి ప్రచారం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement