నిర్మలా దేవిని అరెస్టుచేసి తీసుకెళ్తున్న పోలీసులు
విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారం సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. డీజీపీ రాజేంద్రన్ మంగళవారం ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి విచారణలో నోరు మెదపనట్టు సమాచారం. అయితే, ఆమె సెల్‌ఫోన్‌లో పెద్దల తలరాతలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సెల్‌లోని నంబర్లు, ఫోన్ కాల్స్, చాటింగ్స్ ఆధారంగా ఈ తతంగంవెనుక ఉన్న పెద్దల్ని పసిగట్టేందుకు సీబీసీఐడీ ప్రయత్నిస్తోంది. కాగా, గవర్నర్‌బన్వరిలాల్‌లతో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. అందరి కన్నా ముందుగా, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ ఆదేశించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
సాక్షి, చెన్నై :విద్యార్థినుల్ని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ విరుదునగర్ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి సాగించిన ఆడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టుచేసిన అరుప్పు కోట్టై పోలీసులు రాత్రంతా విచారించారు. అయితే, ఆమె ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం, నోరు మెదపకుండా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల్ని ఎవరి కోసం ప్రేరేపించారో అన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని పలు విధాలుగా సమాధానం రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదని తెలిసింది. అయితే, ఆమె సెల్‌ఫోన్‌లో అసలు బండారం ఉన్నట్టు తేల్చినట్టు సమాచారం. మదురై కామరాజర్ వర్సిటీలో ఉన్నఉన్నతాధికారులతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆయా అధికారులకు తరచూ కాల్స్ చేయడం, వారితో సాగిన చాటింగ్ తదితర అంశాల్ని పోలీసులు పరిగణించి ఉన్నారు. ఆయా నంబర్ల ఆధారంగా ఆ అధికారులెవరో విచారించే పనిలో పడ్డారు. ఆ వర్సిటీలో ఉన్న అధికారుల నంబర్లును గుర్తించినా, ఆ ఉన్నతాధికారులు ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో అరుప్పు కోట్టై పోలీసులు ఉన్న సమయంలో డీజీపీ రాజేంద్రన్ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
నేడు అరుప్పుకోట్టైకి సీబీసీఐడీ
నిర్మలాదేవి వ్యవహారంపై ఇప్పటికే దేవాంగర్ ఆర్స్ కళాశాల, కామరాజర్ వర్సిటీ వేర్వేరుగా విచారణ చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయి. అలాగే, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశించారు. మాజీ ఐఏఎస్ సంతానం నేతృత్వంలో ఆ కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో కేసు తీవ్రతను పరిగణించిన డీజీపీ రాజేంద్రన్ విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ విభాగం అదనపు డీజీపీ, ఎస్సీల నేతృత్వంలో విచారణ ముమ్మరం కానుంది. సీబీసీఐడీ బృందం బుధవారం అరుప్పుకోట్టై చేరుకుని, నిర్మలా దేవిని విచారించేందుకు, తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించనుంది.
గవర్నర్‌పై విమర్శలు
నిర్మలా దేవి ప్రేరణ వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌పై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని పీఎంకే నేత రాందాసు ఆరోపించారు. నిర్మల దేవికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడం, ఈ వ్యవహారం వెనుక పెద్దలు సైతం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తంచేశారు. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఆగమేఘాలపై గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడాన్ని బట్టి చూస్తే, ఎవరినైనా రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయా..? అని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదన్నారు. అయితే, గవర్నర్‌కు అన్ని అధికారులు ఉన్నాయని, విచారణకు ఆదేశించవచ్చంటూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ వెనకేసుకొచ్చారు. కాగా, గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్‌తో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో తనకు తెలిసిన వివరాలను చెల్లదురై వివరించారు.
కఠిన చర్యలు తప్పదు
తాజా వ్యవహారాలపై గవర్నర్ బన్వరిలాల్ స్పందించారు. ప్రథమంగా రాజ్ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆయన వ్యాఖ్యలు చేశారు. చట్ట నిబంధనలకు లోబడే సంతానం నేతృత్వంలో కమిషన్‌ను రంగంలోకి దించినట్టు తెలిపారు. వర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నియమనిబంధనల మేరకు వర్సిటీ చాన్స్‌లర్‌గా తనకే అధికారం ఉన్నట్టు తెలిపారు. అందుకే ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశానన్నారు. కామరాజర్ వర్సిటీ తన ప్రమేయం లేకుండా విచారణకు ఆదేశించిందని, ఇందుకు నా వర్సిటీ వీసీ వివరణ ఇచ్చారన్నారు. ఆ కమిటీని వెనక్కు తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా, ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్సిటీల వ్యవహారాలు అందరికీ తెలియజేయడం, బహిర్గతంగా ఉంచేందుకు తాను చర్యలు తీసుకుంటూ వస్తున్నట్టు వివరించారు.
ఆగని ఆందోళనలు
ప్రొఫెసర్ వెనుక ఉన్న వాళ్లను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలనే నినాదంతో ఆందోళనలు మంగళవారం కూడా సాగాయి. అనేక కళాశాలల విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై గిండిలోని రాజ్ భవన్‌ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేస్తున్న సమాచారంలో అక్కడ భద్రతను పెంచారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో చెన్నై చేపాక్కం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆ విభాగం అధ్యక్షురాలు ఝాన్సీ రాణి, అధికార ప్రతినిధి కుష్భు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించడంతో వారిపై తీవ్ర స్థాయిలో కుష్భు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, వర్సిటీల్లో విద్యార్థినులపై లైంగిక ప్రేరణ, ఒత్తిళ్లు మరీ ఎక్కువేనని పలువురు మాజీ ప్రొఫెసర్లు పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం.
రిమాండ్‌కు నిర్మలా దేవి
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని 12రోజుల రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ఆమెను విరుదునగర్ కోర్టు న్యాయమూర్తి ముంతాజ్ ఎదుట హాజరు పరిచారు. రిమాండ్‌కు ఆదేశించడంతో మదురై కేంద్ర కారాగారానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment