ఆయనో పోలీస్. ఖాకీ డ్రెస్‌ను అడ్డంగా పెట్టుకుని దందాలు సాగిస్తున్నాడు. దోచుకున్న దొంగలనే దోచుకోవడం నుంచి తాను పనిచేసే పోలీస్‌స్టేషన్ పాత భవనం నుంచి విలువైన టేకు కలపను దొంగలించడం వరకు అత్యంత వివాదాస్పద వ్యవహారాలు నెరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై పోస్టుల్లో కొనసాగుతున్న ఆయన కింగ్ మేకర్‌గా మారి స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని డమ్మీ చేసి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తన దందాలకు కానిస్టేబుళ్లను వాడుకుంటున్నాడని సిబ్బంది వాపోతున్నారు. టీడీపీ మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ బోగోలు మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ కక్షలకు ప్రేరేపించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, కావలి(నెల్లూరు) : కావలి సబ్ డివిజన్ పరిధిలోని బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అవినీతి, దందాలు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. దొంగతనాలు చేసే దొంగలను పట్టుకోవాల్సిన సదరు ఏఎస్సై ఏకంగా తాను పనిచేసే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి శిథిలావస్థకు చేరిన బ్రిటిష్ కాలం నాటి భవనంలోని విలువైన టేకు కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుని వెళ్లిన వైనం ఇప్పుడు ఆ శాఖలో అలజడి సృష్టిస్తోంది. కప్పరాళ్లతిప్పలో బ్రిటిష్ కాలంలో పోలీస్‌స్టేషన్ భవనాన్ని నిర్మించారు. వందల ఏళ్ల నాటి కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్ నిర్మాణంలో అత్యంత నాణ్యత, గట్టిదనం కలిగిన టేకును వినియోగించారు. కాగా ఈ పోలీస్‌స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకొంది. దీంతో నూతన భవనాన్ని నిర్మించడంతో అక్కడే కార్యకలాపాలు సాగిస్తున్నారు. సదరు ఏఎస్సై తన సొంతూరు వింజమూరులో కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంటికి అవసరమైన కలప కోసం పాత పోలీస్‌స్టేషన్ భవనంలోని అత్యంత విలువైన టేకు దూలాలను గడ్డి మాటున ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించుకుపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే సర్కిల్, సబ్ డివిజనల్ పోలీస్ బాస్‌ల దృష్టికి కూడా వెళ్లడం, స్థానిక ప్రజానీకానికి సైతం తెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వివాదాస్పద పోలీస్‌గా పేరు
రెండేళ్లుగా కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అత్యంత వివాదాస్పదమైన పోలీస్‌గా పేరు గడించారు. ప్రతి ఒక్క వ్యవహారంలో తలదూర్చడం, నేరగాళ్లకు వత్తాసు పలకడం, పోలీసుల కార్యకలాపాలను నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు తెలియజేయడం వంటి ఒప్పందాలు చేసుకొంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే ఇతర సిబ్బంది తన వ్యవహారాలకు సహకరించకుంటే వారికి సమస్యలు సృష్టిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతని ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు సిబ్బంది సెలవు పెట్ట వెళ్లిపోయినట్లు తెలిసింది. బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్సైను నియమించారు. అతనికి పోలీస్ విధులు కొత్త కావడంతో ఆయన్ను డమ్మీ చేసి అంతా తానై స్టేషన్ ఏఎస్సై వ్యవహారాలు నెరుపుతున్నట్లు పోలీస్ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఎవరైనా ఈ ఏఎస్సై చెప్పినట్లుగా నడుచుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై అంటే పోలీస్ సిబ్బందే హడలి పోతుంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అంతా ఈయన పెత్తనమే కావడంతో పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన అత్యంత విలువైన కలపను దర్జాగా తరలించుకుని పోతున్నా.. స్టేషన్ బాస్‌తో సహా మిగతా సిబ్బంది సైతం నోరు మెదపలేకపోతున్నారని తెలిసింది. ఇక పోలీస్‌స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ముందు తనను కలుసుకోవాలని, అలా చేయకుండా వారిని టార్గెట్ చేసుకొని మరిన్ని ఇబ్బందులు పెట్టడానికి నిందితులతో చేతులు కలిపి పబ్బం గడుపుకుంటాడని విమర్శలు ఉన్నాయి.
దొంగలే ఇతని టార్గెట్
కప్పరాళ్లతిప్ప అంటే చిన్న చిన్న దొంగల నుంచి గజ దొంగల ఊరనే పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక్కడి స్థానికులు కొందరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీరితో ఈ పోలీస్‌కు ఏ టూ జెడ్ పరిచయం. ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న దొంగల విషయాన్ని తెలుసుకుని వారి నుంచి పెద్ద పెద్ద మొత్తాల్లోనే డబ్బులు తీసుకుని వారికి అండదండలు అందిస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. ఈ దొంగలను వెతుక్కుంటూ వచ్చే పరాయి జిల్లాలు, రాష్ట్రాల పోలీసుల సమాచారాన్ని ముందుగానే ఉప్పందించి తప్పిస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బయట దొంగతనాలకు పాల్పడుతున్న స్థానికులు ఏటా డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటారు. వారే ఇతని టార్గెట్. దొంగగా ముద్రపడిన ప్రతి వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది డిసెంబరులో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేల వంతున సుమారు రూ.12 లక్షలు మామూళ్లు వసూలు చేసినట్లు తెలిసింది. కప్పరాళ్లతిప్పకు చెందిన ఒక దొంగ సహకారంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏఎస్సైకు ఈ దొంగ తన ఇంటిపై ఒక గది కట్టించి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది. ఇటీవల ఒక దొంగను పట్టుకుంటే అతని వద్ద ముప్పావు కేజీ బంగారం, వజ్రాల వాచీ దొరికింది. వాటితో పాటు ఆ దొంగ దగ్గర నుంచి రూ.60 వేల డబ్బులు కూడా గుంజినట్లు విశ్వసనీయ సమాచారం. కప్పరాళ్లతిప్పకు చెందిన చదువుకునే విద్యార్థుల వద్ద నుంచి దొంగల దగ్గర కొన్నారంటూ బెదిరించి ఆరు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment