
సాక్షి, హైదరాబాద్ : వర్క్ ఫ్రమ్ హోం పేరిట నిరుద్యోగులకు ఓ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఈ సంఘటనపై బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం ఎస్ వర్క్ ఫ్రమ్ హోం పేరిట కార్ఖానాలో ఉన్న ఓ సంస్థ వారం క్రితం మల్కాజిగిరి శివపురికాలనీలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సంస్థలో చేరడానికి రూ.2,500, దరఖాస్తుకు రూ.500, పని చేయడానికి ఉపయోగించే షీట్స్ కోసం మరో రూ.2,500 చెల్లిస్తే నెలకు ఎనిమిది వేలు సంపాదించుకోవచ్చని నిరుద్యోగులను నమ్మించింది.
దీంతో నాచారం, మల్కాజిగిరి, మౌలాలి, ఈసీఐఎల్ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, విద్యార్థులు సుమారు నలభైమంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఉద్యోగంలో చేరారు. ఎంతమందిని చేర్పిస్తే వారికి ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున అందజేస్తామని చెప్పడంతో చాలామంది చేరారు. సంస్థ అందచేసే షీట్స్‌లో వారు పంపించిన క్రమ సంఖ్యలో నింపి వారానికి ఒకసారి అందచేయాలి. అలా అందచేసిన షీట్లను బట్టి వారికి నగదు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే వారం దాటినా నగదు చెల్లించకపోవడంతో బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సెక్టార్ ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.