
నిందితులు నాగభూషణం, సిసింద్రీ (ఫైల్)
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోలీసులు దొంగాట ఆడుతున్నారా? తనపైన హత్యయత్నానికి ప్రయత్నించిన నిందితులను మీడియా సా«క్షిగా అప్పగించినా... మంత్రి లోకేష్ ఒత్తిళ్ల వల్ల వారిని వదిలేశారా? విచారణలో మంత్రి లోకేష్ ప్రమేయంపై నిందితులు విచారణలో ఒప్పుకున్నారా? అందుకే ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదా? చిన్న కేసుల్లో వదిలినట్టు నిందితులను వదిలేశారా? బయటకు వచ్చిన నిందితులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? మూడు రోజులపాటు అరెస్ట్ చూపకుండా వారిని స్టేషన్‌లోనే పోలీసులు వేధించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు న్యాయనిపుణులు.
చిత్తూరు, తిరుపతి రూరల్: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై రెక్కీ కేసులో ఎంఆర్‌పల్లి పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్ర జరిగిందని కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని పూర్తి స్థాయిలో విచారించకుండానే వారిని వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజులపాటు ఆచూకీ లేకుండా పోయిన నిందితులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది సెర్చ్ పిటీషన్ వేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే న్యాయస్థానానికి ఎలా వచ్చారు? వారిని నడిపిస్తున్నది ఎవరు? అనేది పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే...
ప్రభుత్వ నిర్వహిస్తున్న పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై వారం క్రితం హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేకు సంబంధించిన సమాచారం ఆయన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని గుర్తించారు. ఆ డ్రైవర్లను నాగభూషణం, సిసిం ద్రీగా గుర్తించారు. వారిని విచారిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షల సుపారీ ఇస్తామన్నారని నాని అనుచరులు చెప్పడం వల్లే తాము ఈ కుట్రకు పాల్పడినట్లు వారు మీడియా ఎదుట, పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో వారిని ఈ నెల 5వ తేదీన అర్బన్ ఎస్పీకి అప్పగించారు. కేసు నమోదు చేసి విచారించాలని ఎంఆర్‌పల్లి పోలీసులకు ఎస్పీ రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో 29 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో 6వ తేదీ రాత్రి ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో హడవిడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు.
సర్వత్రా విమర్శలు
పుణ్యక్షేత్రమైన తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యేపైనే రెక్కీ నిర్వహించి, ఒక విష సంస్కృతికి బీజం వేస్తే, ప్రశాంతత నెలకొల్పాల్సిన పోలీసు అధికారులు పట్టించిన నిందితులను సైతం వదిలేయడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభ్యుడికి భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు భక్తులు, సామాన్యులు, స్థానికులకు ఏమాత్రం భద్రత కల్పిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విచారణలో మంత్రి లోకేష్ పేరు
ఎమ్మెల్యేపై హత్యాయత్నం, రెక్కీ కేసులో నిందితులుగా ఉన్న నాగభూషణం, సిసింద్రీల విచారణలో మంత్రి లోకేష్ పేరు బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఉలిక్కిపడిన పోలీసు అధికారులు విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పైస్థాయిలో ఒత్తిళ్ల వల్లే కేసును పక్కదారి పట్టిస్తూ ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిపై హత్యయత్నానికి కుట్ర జరిగిందనే కేసులో నిందితులను వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో విచారిస్తే మంత్రి లోకేష్ హస్తంతోపాటు హత్యాయత్నం కుట్ర విషయం బయటకు వస్తుందని ప్రజాసంఘాలు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
విచారించకుండానే వదిలేశారు
5వ తేదీ నుంచి నిందితులు నాగభూషణం, సిసింద్రీలను పోలీసులు స్టేషన్ లాకప్‌లోనే అక్రమంగా ఉంచుకున్నారనే ఆరోపణలు ఉన్నారు. వారిని అరెస్ట్ చూపకపోవడం, లాకప్‌లో పెట్టి చెవిరెడ్డికి వ్యతిరేకంగా చెప్పాలని వేధిస్తున్నారనే సమాచారం గుప్పుమంది. లోపాయికారీగా కుట్ర జరుగుతున్నట్లు అనుమానంతో వారిని వెంటనే కోర్టు ముందు హాజరు పరచాలని శుక్రవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది వాణి తిరుపతి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సెర్చ్ పిటిషన్ వేశారు. దీంతో 10 నిమిషాల్లోనే నిందితులు నాగభూషణం, సిసింద్రీలను కోర్టు ముందు వదిలి, ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని బెదిరించి పిటీషన్ వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పిటీషన్ చూసిన న్యాయమూర్తి ఆగ్రహించి, మీరే నిందితులైతే మీకు ప్రాణహాని ఉందని పిటీషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు సమయం వృథా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటీషన్‌ను తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment