మానవ హక్కుల కార్యకర్త చరణ్‌జీత్ సింగ్ (ఫైల్ ఫొటో)
పెషావర్ : ప్రముఖ సిక్కు నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త చరణ్‌జీత్ సింగ్(52) పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. చరణ్‌జీత్ షాపులో ఉన్న సమయంలో దాడి చేసిన గుర్తు తెలియని దుండగుడు ఆయనను కాల్చి చంపినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితమే ఖుర్రం ఏజెన్సీ నుంచి వచ్చి పెషావర్‌లో స్థిరపడిన చరణ్‌జీత్ సిక్కుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా పెషావర్‌లో సిక్కులు హత్యలకు గురౌతున్న నేపథ్యంలో.. నాయకుడు చరణ్‌జీత్ మరణంతో స్థానిక సిక్కులు ఆందోళనకు గురవుతున్నారు.
జిజియా చెల్లించనందుకేనా..?
ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో(ఫెటా) నివసించే మైనార్టీలైన సిక్కులు పెషావర్‌లో స్థిరపడి చిన్న చిన్న షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మొహల్లా జోగన్ షాలో గల గురుద్వారా సమీపంలో నివసిస్తున్నారు. అయితే మైనార్టీలపై కక్షగట్టిన తాలిబన్ వంటి పలు మిలిటెంట్ గ్రూపులు జిజియా(ఇస్లామిక్ పన్ను) కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. అందుకు నిరాకరించిన వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వాయువ్య పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment