Sikh leaders
-
మన పాలిట మరో పాకిస్తాన్!
ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం. -
ఎవరీ చన్నీ?
పంజాబ్ సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ తండ్రి హర్సా సింగ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, బ్లాక్ సమితీ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి నుంచి చన్నీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. స్కూల్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్‌లోని గురు గోవింద్‌సింగ్ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత జలంధర్‌లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్య ఉంది. ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్లో బంగారు పతకం సాధించడం విశేషం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో దళితులు అవకాశాలు దక్కడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించి అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. సీఎంను మార్చాలంటూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2018లో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అనుచితమైన మెసేజ్ పంపించినట్లు చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్‌లో ‘మీ టూ’వివాదంలో ఆయన కేంద్ర బిందువుగా మారారు. సదరు ఐఏఎస్ అధికారిణి ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తర్వాత వివాదం పరిష్కారమైందని నాటి సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, ‘మీ టూ’వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జ్యోతిష్యంపై గురి ఎక్కువ... జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవడానికి పూజలు, యాగాలు అధికంగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. 2017లో మంత్రివర్గంలో చేరిన వెంటనే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్‌లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్ అధికారులు మూసివేశారు. అలాగే ఓ జ్యోతిష్యుడి సలహాతో చన్నీ ఖరార్‌లోని తన ఇంటి ప్రాంగణంలో ఏనుగుపై ఊరేగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. – నేషనల్ డెస్క్, సాక్షి సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆఫర్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఆదివారం చెప్పారు. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించానని, సిక్కు నాయకుడే పంజాబ్ సీఎంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. శనివారం రాజీనామా చేసిన అమరీందర్ వారసుడి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. పార్టీ నేత రాహుల్ గాంధీతో శనివారం రాత్రి, ఆదివారం అంబికా సోనితో భేటీ అయ్యారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ పార్టీ పెద్దలు తనను కోరిన మాట నిజమేనని ఆమె మీడియాతో చెప్పారు. కానీ, పంజాబ్‌లో గత 50 ఏళ్లుగా సిక్కు నాయకులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. దేశంలో సిక్కు సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు. -
ప్రముఖ సిక్కు నాయకుడి హత్య
పెషావర్ : ప్రముఖ సిక్కు నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త చరణ్‌జీత్ సింగ్(52) పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. చరణ్‌జీత్ షాపులో ఉన్న సమయంలో దాడి చేసిన గుర్తు తెలియని దుండగుడు ఆయనను కాల్చి చంపినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితమే ఖుర్రం ఏజెన్సీ నుంచి వచ్చి పెషావర్‌లో స్థిరపడిన చరణ్‌జీత్ సిక్కుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా పెషావర్‌లో సిక్కులు హత్యలకు గురౌతున్న నేపథ్యంలో.. నాయకుడు చరణ్‌జీత్ మరణంతో స్థానిక సిక్కులు ఆందోళనకు గురవుతున్నారు. జిజియా చెల్లించనందుకేనా..? ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో(ఫెటా) నివసించే మైనార్టీలైన సిక్కులు పెషావర్‌లో స్థిరపడి చిన్న చిన్న షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మొహల్లా జోగన్ షాలో గల గురుద్వారా సమీపంలో నివసిస్తున్నారు. అయితే మైనార్టీలపై కక్షగట్టిన తాలిబన్ వంటి పలు మిలిటెంట్ గ్రూపులు జిజియా(ఇస్లామిక్ పన్ను) కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. అందుకు నిరాకరించిన వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వాయువ్య పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పంజాబ్‌లో జైలు బద్దలు
‘ఖలిస్తాన్’ చీఫ్ హర్మిందర్తో పాటు మరో ఐదుగురు గ్యాంగ్స్టర్లను తప్పించిన దుండగులు - పోలీసు దుస్తుల్లో జైల్లోకి ప్రవేశం.. గాల్లో 35 రౌండ్ల కాల్పులు - తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కశ్మీరా సింగ్ - ఘటన జరిగిన రెండు గంటల్లోనే యూపీలో సూత్రధారి అరెస్టు పటియాలా/చండీగఢ్/న్యూఢిల్లీ: నిరంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండే పంజాబ్‌లోని నభా జైలుపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో ఐదుగురు గ్యాంగ్స్టర్లను తప్పించి తీసుకెళ్లారు. తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కూడా అయిన కశ్మీరా సింగ్ ఉన్నాడు. దీంతో పంజాబ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పది తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న మింటూను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఘటన జరిగిన రెండు గంటల్లోనే.. తప్పించుకోవటంలో దాడి సూత్రధారి పర్మిందర్ సింగ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి ఓ ఎస్సెల్లార్, మూడు రైఫిల్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను అందించిన సమాచారంతో తప్పించుకున్న వారంతా బృందాలుగా విడిపోరుు నేపాల్ చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. తప్పించుకున్న వారిలో ఖలిస్తాన్ చీఫ్ హర్మిందర్తో పాటు గ్యాంగ్స్టర్లు విక్కీ గౌండర్, అమన్‌దీప్ దోహతియాన్, గుర్ప్రీత్ సెకోన్, నీతా డియోల్, కశ్మీరా సింగ్‌లు ఉన్నారు. 2008లో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌పై దాడికి పాల్పడిన ఘటనతో పాటు మరో పది కేసుల్లో హర్మిందర్ నిందితుడు. కాగా, జైలుకు 20 కిలోమీటర్ల దూరంలో నాకాబందీని దాటి వెళ్తున్న వాహనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసు దుస్తుల్లో వచ్చి..: ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలు సెంట్రీ వద్దకు వచ్చి.. ఇద్దరు ఖైదీలను తీసుకొచ్చామని చెప్పి గేటు తీరుుంచారు. లోపలకు వెళ్లగానే సినీ ఫక్కీలో సెంట్రీతోపాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. గాల్లోకి దాదాపు 35 రౌండ్ల కాల్పులు జరిపి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారని డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. జైల్లో వీరిని కనీసం అడ్డుకునేందుకూ ఎవరూ ముందుకురాలేదు. నిర్లక్ష్యమా? కావాలనే చేశారా?: పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అత్యవసర భేటీ ఏర్పాటు చేసి.. ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటనపై బాదల్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జైలు బద్దలు కొట్టడంపై పంజాబ్ సర్కారు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు జైల్లోని అధికారులెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతోంది. ఉప ముఖ్యమంత్రి సుఖ్భీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. భయపడాల్సిందేమీ లేదని, వారెక్కడికీ(ఖైదీలు) తప్పించుకుపోలేరని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటన వెనక పాక్ హస్తం ఉండొచ్చన్నారు. కేఎల్ఎఫ్ చరిత్ర ఇదీ... సిక్కులకు ప్రత్యేక రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభమైన రాజకీయ జాతీయవాద పోరాటమే ఖలిస్తాన్ ఉద్యమం. ఇది క్రమేపీ మిలిటెంట్ రూపం సంతరించుకుంది. ఇందులో ముఖ్యపాత్ర పోషించిన సంస్థల్లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్) ఒకటి. సాయుధపోరుతోనే సిక్కు రాజ్యం సాధ్యమనే సిద్ధాంతంపై ఇది ఏర్పాటైంది. దీన్ని 1986లో అరూర్, సుఖ్వీందర్ సింగ్‌లు స్థాపించారు. 1990 తొలినాళ్లలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసినప్పుడు దేశం విడిచి పారిపోరుున సంస్థ సభ్యులకు పాక్ ఆశ్రయం కల్పించిందన్న ఆరోపణలున్నారుు. కేఎల్ఎఫ్ హింసాత్మక దాడులకు పాల్పడింది. పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను హత్య చేసింది. 1991లో ఢిల్లీలో రుమేనియా రాయబారిని అపహరించింది. అరుుతే సిక్కు నేతలు విమర్శించడంతో అతన్ని సురక్షితంగా విడిచిపెట్టింది. 1992, జూలై 29న సంస్థ అప్పటి చీఫ్ గుర్జాంత్ సింగ్‌ను పోలీసులు హతమార్చారు. ఆ ఏడాది ఆగస్టులో కొత్త అధిపతి నవరూప్ను చంపామన్న పోలీసులు తర్వాత అతడు దేశం విడిచి పారిపోయాడన్నారు. 2005 దాక సంస్థ సభ్యుల అరెస్టులు సాగారుు.