ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది.
తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది.
భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.
ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు.
దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం.
కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది.
పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస.
ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది.
భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది.
ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి.
కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.
ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ.
ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది.
అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం.
మన పాలిట మరో పాకిస్తాన్!
Published Wed, Oct 16 2024 12:30 AM | Last Updated on Wed, Oct 16 2024 3:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment