
తుప్రాన్: ఓ యువకుడు తాను స్వయంగా తయారు చేసిన తుపాకీని పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ డివిజన్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోడూర్ గ్రామానికి చెందిన మరదన రమేశ్ (26) మనోహరాబాద్ మండలం రమాయిపల్లి సమీపంలోని ఓ స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ చూసి నాటు తుపాకీని, మూడు తూటాలను తయారు చేశాడు.
తుప్రాన్ గ్రామ పంచాయతీ వెనుకాల ఉన్న కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ ఓ తూటాను పేల్చాడు. దీంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నాటు తుపాకీ, పేల్చిన రెండు తూటాలతో పాటు పేలని మరో తూటాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.