గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల
సాక్షి, హైదరాబాద్ : గౌలిదొడ్డి గురుకుల పాఠశాల.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని గురుకులం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన గురుకుల పాఠశాలల విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్, ఎంసెట్‌లకు శిక్షణ ఇస్తుంటారు. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ప్రముఖులు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులందరూ విజిట్‌లో భాగంగా గురుకులాన్ని సందర్శిస్తుంటారు. అలాంటి గురుకులంలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులకు దిగాడు.
గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్æ ప్రమోదని భర్త దామోదర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్లతో పాటు పోక్సో (పిల్లలపై లైంగిక వేధింపుల చట్టం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఐఐటీ ఫౌండేషన్ తరగతులంటూ..
దామోదర్ గతంలో నారాయణ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పని చేశాడు. పాఠశాలలోని క్వార్టర్స్‌లో కొడుకు, భార్యతో ఉంటున్న దామోదర్.. 2012 నుంచి గురుకులంలో స్వచ్ఛందంగా ఐఐటీ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నాడు. తాజా ఘటనతో ప్రిన్సిపాల్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలిసింది. దామోదర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని గచ్చిబౌలి సీఐ గంగాధర్ తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ప్రిన్సిపాల్ ప్రమోదను సస్పెండ్ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దామోదర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. నిందితుడు తమపై పలురకాలుగా ఒత్తిడి చేయిస్తున్నాడని.. రాజకీయ నాయకులు, కుల సంఘాలతో ఫోన్లు చేయిస్తూ కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment