సాక్షి, సిటీబ్యూరో: ఖాతాదారులకు చెందిన షేర్లు కాజేయడంతో పాటు నకిలీ ధ్రువీకరణలతో వాటిని విక్రయించి రూ.5.4 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాచిగూడకు చెందిన శ్రీనివాసచారి వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను కొన్నేళ్ల క్రితం బేగంపేటలోని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన షేర్ల వ్యాపార సంస్థలో అనేక షేర్లు ఖరీదు చేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన వీటిని అమ్ముకోలేదు. ఈ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రవణ్‌కుమార్, అతని సహాయకుడు లక్ష్మీ దీపక్ తమ సంస్థలో షేర్లు ఖరీదు చేసి, కొన్నేళ్ల పాటు వాటిని తిరిగి విక్రయించని వ్యక్తుల వివరాలు సేకరించారు. వాటిలో శ్రీనివాసచారి ఖరీదు చేసిన షేర్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వృద్ధాప్యంలో ఉండటంతో అతని మనుమడైన డాక్టర్ విజయ్‌ను సంప్రదించారు. మీ తాతగారు సుదీర్ఘకాలం క్రితం తమ సంస్థ ద్వారా భారీ స్థాయిలో షేర్లు ఖరీదు చేసినట్లు చెప్పడంతో విజయ్ ఆ షేర్లు విక్రయించి నగదు ఇవ్వాల్సిందిగా కోరారు.
కొంత మేరకు షేర్లు విక్రయించగా వచ్చిన నగదును శ్రవణ్, దీపక్‌లు విజయ్‌కు అప్పగించారు. ఆపై కుట్ర పన్నిన వీరు మిగిలిన షేర్లకు సంబంధించిన మొత్తం కాజేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా విజయ్, శ్రీనివాసచారి పేర్లతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసిన ఇరువురూ వీటి ఆధారంగా వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచారు. రూ.2.94 కోట్ల విలువైన షేర్లను అనధికారికంగా విక్రయించి ఆ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసుకున్నారు. వీటి నుంచి నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని కాజేశారు. అలాగే ఉషారాణి అనే మహిళకు చెందిన ధ్రువీకరణలు సంగ్రహించిన దీపక్ వీటి ఆధారంగా ఆమె షేర్లు విక్రయించాడు. మొత్తం రూ.2.5 కోట్లు శ్రవణ్ సహకారంతో తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. సహకరించినందుకు కమీషన్‌గా శ్రవణ్‌కు రూ.5 లక్షలు చెల్లించాడు. ఇలా వీరు రూ.5.4 కోట్లు కాజేశారు. 2014లో జరిగిన ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు గతేడాది, ఈ ఏడాది ఫిర్యాదులు అందాయి. వీటిని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శ్రీనివాసాచారి కేసులో నిందితులను గత డిసెంబర్‌లో అరెస్టు చేసింది. ఇటీవల నమోదైన ఉషారాణి కేసుకు సంబంధించి మంగళవారం దీపక్‌ను పట్టుకుంది. పరారీలో ఉన్న శ్రవణ్ కోసం గాలిస్తోంది.
‘చాటింగ్’కు రూ.లక్షలు ఖర్చు...
ఇలా సంపాదించిన సొమ్ముతో దీపక్ జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్‌నెట్‌లో ని కొన్ని చాటింగ్ సైట్స్‌లో వీడియో చాటింగ్ చేయడానికి డాలర్ల రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీటికి బానిసగా మారిన దీపక్ ప్రతి రోజూ గంటల తరబడి అదే పనిలో ఉండేవాడు. చాటింగ్‌లో పరిచయమైన వారితో ‘వ్యక్తిగత సంభాషణలు’ చేయాలన్నా, వారి ‘ఫొటోలను’ పొందాలన్నా మరికొంత చెల్లించాల్సిందే. ఈ రకంగా దీపక్ రూ.లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. చాటింగ్ ద్వారా పరిచయమైన ఓ విదేశీ యువతికి పూర్తి ఖర్చులు భరించిన ఇతగాడు ఢిల్లీకి రప్పించాడు. అక్కడి ఓ సెవెన్ స్టార్ హోటల్‌లో నెల రోజులకు పైగా ఆమెతో కలిసి బస చేశాడు. విమానాల్లో షికార్లు, స్టార్ హోటల్స్‌లో బస, విలాసవంతమైన జీవితం... వీటికే డబ్బంతా ఖర్చు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment