సాక్షి, హైదరాబాద్ : పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో దక్కేదని డాక్టర్ ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో వెళ్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీని పంక్చర్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రియాంక ఇంటికి రాలేదని ఫోన్ వచ్చింది. పదకొండు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశా. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రియాంక వెళ్లేటప్పుడు విజువల్స్ ఉన్నాయి. వచ్చే విజువల్స్ లేవని చెప్పారు. సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే మా పాప ప్రాణం పోయింది. పోలీసులు సమయం వృథా చేశారు. వెంటనే స్పందించి ఉంటే తను ప్రాణాలతో దొరికేది. పోలీసుల తీరు చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తోంది. ఓ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో స్టేషనుకు వెళ్లమన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన సరిగా లేదని.. తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఉద్వేగానికి గురయ్యారు. తమ కూతురు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు.
ఇక ప్రియాంకారెడ్డి తల్లి విజయమ్మ మాట్లాడుతూ... ‘ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో పోయి ఉంటుంది అన్నారు. ఏం జరిగిందో.. నిజాలు మాత్రమే చెప్పండి అని అడిగారు. వెళ్లేటప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉంది. వచ్చేటపుడు ఫుటేజీ లేదు. మీ అమ్మాయి ఎవరితోనూ వెళ్లి ఉంటుంది. రేపు వస్తది చూడండి అని మాట్లాడారు. వాళ్లు తొందరగా స్పందించి ఉంటే మా అమ్మాయి బతికి ఉండేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment