సాక్షి, చెన్నై, మెదక్ : తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా తిరుమయం వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 11మంది ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ప్రమాదంలో గాయపడ్డ నరేష్ గౌడ్‌ను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నర్సాపూర్ నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం పుదుకొట్టై మెడికల్ కాలేజీకి చేరుకుంది. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి వారి గ్రామాలకు తరలించనున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగింపుకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి మృతదేహాలు నర్సాపూర్ చేరుకోనున్నాయి. రోడ్డు మార్గం ద్వారా మృతదేహాలను నర్సాపూర్ తరలించే ఆలోచన చేస్తున్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో వైద్యులు అతన్ని తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి పుదుకొట్టై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ నలుగురు కోలుకుంటున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వారి గ్రామాలకు వారిని పంపుతామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ మలైపాండిని మదురైలో అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment