సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, అనిల్‌కుమార్ (ఫైల్)
జగిత్యాల క్రైం/రాయికల్: విందులో ఏర్పడ్డ చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. స్నేహితులే ఓ రౌడీషీటర్‌ను హత్య చేసిన ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా సింగరావుపేట శివారులో జరిగింది. అయితే మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల మండలం చల్‌గల్‌కు చెందిన బొల్లారపు యశ్వంత్, గాజర్ల కిశోర్ జగిత్యాలలోని అరవింద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ మాద అనిల్‌కుమార్(21)తో కలిసి సింగరావుపేట శివారులోని ఓ రేకులషెడ్డులో మంగళవారం విందు చేసుకున్నారు. చిన్నపాటి గొడవనే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం యశ్వంత్, కిశోర్ చల్‌గల్‌కు వచ్చి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని.. అత్యవసరంగా కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని కారు తీసుకెళ్లారు.
అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి గుర్తుతెలియని చోట పడేశారు. తర్వాత యశ్వంత్ అతని మిత్రునికి ఫోన్‌చేసి కారును మెట్‌పల్లిలో వదిలిపెట్టామని, తాము అనిల్‌ను హత్య చేశామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కారు యజమాని, అతని మిత్రుడు మెట్‌పల్లికి వెళ్లి కారును అందులో రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ సీఐ రాజేశ్, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, రాయికల్ ఎస్సై కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి ఫిర్యాదుతో రాయికల్ ఠాణాలో కేసు నమోదు చేశారు. అనంతరం జగిత్యాల డీఎస్పీ భద్రయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో రక్తపు మరకలు ఉండడంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులు దొరికితేనే మృతదేహం లభ్యం?
అనిల్‌కుమార్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు లొంగిపోతే తప్ప మృతదేహం ఎక్కడుందనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. నిందితుల సెల్‌ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో పోలీసులు పలుకోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment