ఎర్రోళ్లు దర్జాగా..! | Red Wood Smuggling With Police Dress In PSR Nellore | Sakshi
Sakshi News home page

ఎర్రోళ్లు దర్జాగా..!

Published Wed, Jun 6 2018 11:28 AM | Last Updated on Wed, Jun 6 2018 11:28 AM

Red Wood Smuggling With Police Dress In PSR Nellore - Sakshi

పోలీసుల ఎత్తులకు ఎర్ర చందనం స్మగ్లర్లు పైఎత్తులు వేస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగటం లేదు. పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టని రూట్లు చూసుకుని పలు మార్గాల్లో ఎర్ర చందనం రవాణా సాగిస్తున్నారు. అది కూడా సరికొత్త ఎత్తుగడతో పోలీసుల దుస్తుల్లో, అత్యాధునిక  ఆయుధాలను ధరించి ఎర్రచందనాన్ని జిల్లాతో పాటు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ప్రత్యేకంగా ఉన్న రెండు ముఠాలు ఒక రూట్‌ను నిర్ణయించుకుని ఆ మార్గంలోనే అక్రమ రవాణా చేస్తున్నాయి. వీళ్లు కాకుండా వేరే ముఠా ఎవరైనా అటుగా అక్రమ రవాణా చేసినా దాడులు చేయటం, లేదంటే సరుకును హైజాక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టేందుకు సైతం వెనుకాడని రీతిలో అక్రమ రవాణా దందా సాగిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 31వతేదీన ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ముఠాను అరెస్ట్‌ చేయటంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ఇదే తరహాలో జిల్లాలో రెండు ముఠాలు, ఇతర రాష్ట్రాల్లో మరో రెండు ముఠాలు ఉన్నట్లు నిర్ధారించి, ఆదిశగా పోలీసు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

వెలుగొండల్లోని ఎర్రచందనానికి డిమాండ్‌జిల్లా సరిహద్దులోని వెలుగొండ, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం వృక్షాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతంలో మినహా మరెక్కడా ఎర్రచందనం లభించకపోవటంతో అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, వెలుగొండ అటవీ ప్రాంతంలోని రాపూరు, దక్కిలి, కలువాయి, వెంకటగిరి  మండలాల సరిహద్దుల్లో ఎర్రచందనం అధికంగా ఉంది. దీంతో స్థానికంగా పదుల సంఖ్యలో స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇక్కడికి కూలీలను రప్పించి అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి రహస్య ప్రాంతాల్లో భారీగా డంప్‌ చేసి స్మగ్లర్లతో లింకులు పెట్టుకుని విక్రయిస్తుంటారు. ఈ వ్యవహారంలో అక్రమ రవాణే కీలకంగా ఉంటుంది. జిల్లా హద్దులు దాటించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తే అక్కడి నుంచి సముద్ర మార్గాన కొన్ని సందర్భాల్లో విమానాల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది.

ఈ క్రమంలో జిల్లాలో పోలీసులు కూంబింగ్‌ ప్రక్రియను సీరియస్‌గా నిర్వహించటంతో తొమ్మిది నెలల్లో 57 కేసులు నమోదు చేశారు. కీలక గ్యాంగులను అరెస్ట్‌ చేశారు. కొంత మేరకు అక్రమ రవాణాను నిర్మూలించగలిగారు. ఈ క్రమంలో జిల్లాతో పాటు సరిహద్దులోని కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్మగ్లర్లు రూట్‌ మార్చి అనంతపురం, బళ్లారి మీదుగా బెంగళూరు రూట్‌లో అధికంగా అక్రమ రవాణాకు తెరతీశారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా హోస్పేట్‌ తాలుకాకు చెందిన కొందరు కరుడుగుట్టిన నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడి అనంతపురం సరిహద్దుల్లోని బాగేపల్లి నుంచి కర్ణాటక సరిహద్దు హోస్పేట్‌ వరకు సుమారు 150కి.మీ.లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ వాహనం తిరగాలన్నా, అక్రమ రవాణా చేయాలన్నా వీరికి కప్పం కడితే సరిహద్దులు దాటుతుంది. ఎర్రదుంగలు తరలించే ఈ ముఠాలు టన్నకు రూ.1.50లక్షలు కప్పం చెల్లిస్తే ఎస్కార్ట్‌గా వెళ్లి సరిహద్దులు దాటిస్తారు. అది కూడా పోలీసు యూనిఫాం వేసుకుని ఈ పని చేస్తున్నారు. వారికి డబ్బులు ఇవ్వని వాహనాలను హైజాక్‌చేసి చెన్నై తదితర ప్రాంతాల్లో వాటిని అమ్మి సొమ్ముచేసుకోసాగారు.

నెల్లూరులో అరెస్ట్‌తో..
ఎర్రచందనం అక్రమ రవాణా తదితర నేరాలకు పాల్పడే ఆరుగురు సభ్యులున్న ఓ ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 31వ తేదీన అరెస్ట్‌ చేయడంతో ఈ అక్రమరవాణా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ముఠా కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా çహోస్పేట్‌ తాలుకా శివపురం గ్రామానికి చెందిన శివపురం మునియప్ప వెంకటరాజు వికలాంగుడు. ఆయన తన సోదరుడు శివపురం మునియప్పరవి, రామప్ప మంజునాథ, రామప్ప రాజేంద్ర, శివపురం రవి నవీన్‌లు బంధువులు. వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా సంబేరి గ్రామానికి చెందిన రాజేంద్ర బాలాజీతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్రమరవాణా కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.  ఈ మూడు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న స్మగ్లర్ల వివరాలు సేకరించి వారిని సంప్రదించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో  ఎర్రదుంగలను అనంతపురం, హోస్పేట్‌ మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటిస్తామని అందుకు గాను టన్నుకు రూ.1.50లక్షలు కప్పం చెల్లించాలని స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకునేవారు. బెంగళూరుకు వెళ్లాలంటే హోస్పేట్‌ ప్రధాన మార్గం కావడంతో స్మగ్లర్లు ముఠా చెప్పిన కప్పం చెల్లించేవారు.  దీంతో ముఠా సభ్యులు పోలీసుల వలే దుస్తులు ధరించి ఆదునాతన ఆయుధాలు(తుపాకులు)ను చేతబూని ఎర్రచందనం సరిహద్దులు దాటిస్తారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వీరిలో అధిపత్య పోరు రావటంతో విషయం బయటకు వచ్చింది.

తొమ్మిది నెలల్లో 57 కేసులు
గత తొమ్మిది నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు 57 కేసులు నమోదు చేసి రూ.20 కోట్ల విలువజేసే 20 టన్నుల ఎర్రచందనం దుంగలను సీజ్‌చేశారు. వీటితో పాటు 69 వాహనాలను, 10 తుపాకులను, 40 అత్యాధునిక ఆయుధాలను సీజ్‌చేసి 929 మందిని అరెస్ట్‌ చేశారు. గతనెల 31వ తేదీన అరెస్ట్‌ చేసిన అంతర్రాష్ట్ర ముఠా వద్ద నుంచి రూ.1.50 కోట్లు విలువజేసే ఎర్రదుంగలు, అధునాతన ఆయుధాలు ఎస్‌బీఎంఎల్‌ గన్, ఎయిర్‌గన్, ఎఫ్‌ఎక్స్‌రాయల్‌ ఎయిర్‌గన్, 177 నంబర్‌ ఎయిర్‌ఫిస్టల్, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

185 మందితో కూంబింగ్‌ టీములు
ఎర్ర చందనం ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ప్రకియ నిరంతరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 14 బృందాల్లో ఉన్న 185 మంది పోలీసు టీములు కూంబింగ్‌ ప్రకియ కొనసాగిస్తున్నాయి. జిల్లాలో గతంలో కార్యకలాపాలకు పాల్పడిన ముఠాల కదలికలపైనా నిఘా కొనసాగుతోంది. కర్ణాటక తరహా ముఠాలు కొన్ని ఉన్నాయి. వాటిపై కూడా నిఘా పెట్టాం.–పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement