పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది? | Relation With West Godavari For Geesukonda Murder Cases | Sakshi
Sakshi News home page

పూడ్చి పెట్టారు.. కానీ పోస్టుమార్టం నివేదికలో ఏముంది?

Published Tue, May 26 2020 12:24 PM | Last Updated on Tue, May 26 2020 2:57 PM

Relation With West Godavari For Geesukonda Murder Cases - Sakshi

సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన సంచలనంగా మారింది. ఏకంగా పది హత్యలు చేసిన హంతకుడిని విచారించిన పోలీసులకు నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. వరంగల్‌ సీపీ హత్యల వివరాలు వెల్లడించారు. ఈ హత్యల పరంపరలో తొలి హత్యకు బీజం పడింది జిల్లాలో కావడం గమనార్హం.

చాగల్లు–బ్రాహ్మణగూడెం మధ్య ప్రాంతంలో మార్చి 7న రైలు నుంచి పడి ఒక మహిళ మృతిచెందింది. పది హత్యల హంతకుడు సంజయ్‌ చేసిన ఈ హత్య అనంతరం ఏకంగా మక్సూద్‌ కుటుంబ సభ్యులతో పాటు 9 మందిని హత్య చేశాడు. కిరాతకంగా భోజనం, కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. నిద్రలోకి జారుకున్న వెంటనే గోనెసంచెలో వేసి లాక్కుంటూ వెళ్లి బావిలో పడేశాడు. గోనెసంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్‌ కుటుంబం కనిపించలేదంటూ ఫ్యాక్టరీ యజమాని ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసును ఛేదించారు.  

కూతురిపై కన్నేసి.. కుటుంబాన్నే కాటేశాడు  
మక్సూద్‌ కుటుంబానికి బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌ నాలుగేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. మక్సూద్‌ భార్య అక్క కుమార్తె రఫీకా పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి వరంగల్‌లో ఉంటుంది. సంజయ్‌ రఫీకాతో పరిచయం పెంచుకుని కొద్దికాలం సహజీవనం చేశాడు. ఈ క్రమంలో సంజయ్‌ చూపు రఫీకా కుమార్తెపై పడింది. తన కూతురుతో సంజయ్‌ సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక రఫీకా అతనితో గొడవపడింది. ఇక ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నాడు. మార్చి 7న పశ్చిమబెంగాల్‌ తీసుకువెళతానని నమ్మించాడు. ఇద్దరూ గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కోల్‌కతా బయలుదేరారు. 

ప్రయాణ సమయంలో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి తెల్లవారుజామున 3 గంటలకు చున్నీని మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోసేశాడు. జిల్లాలోని నిడదవోలు ప్రాంతంలోని చాగల్లు–బ్రాహ్మణగూడెం మద్యలో రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉంది. రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రఫీకా హత్య బయటపడకుండా ఉండేందుకు మక్సూద్‌ కుటుంబంతో పాటు 9మంది ప్రాణాలు బలితీసుకున్నాడు.  చదవండి: గీసుకొండ బావిలో 9 మృతదేహాలు

పోస్టుమార్టం నివేదికలో ఏముంది ?  
రఫీకా రైలులో నుంచి పడి మృతిచెందగా రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యుల ఆచూకీ లభించకపోవటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఏమి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. సంజయ్‌ రఫీకాకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వటంతో పాటు, చున్నీ బిగించి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఒకవేళ పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్థారిస్తే రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించారా? లేదా అనేది సందేహంగా మారింది. ఈ అంశంపైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చదవండి: హైదరాబాద్‌ నుంచి ‘క్లూ’స్‌ టీం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement