ఆదిశేషయ్య అడ్డంగా దొరికాడు | Revenue Inspector Caught Bribery Demands In East Godavari | Sakshi
Sakshi News home page

ఆదిశేషయ్య అడ్డంగా దొరికాడు

Published Wed, Jul 11 2018 6:44 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Revenue Inspector Caught Bribery Demands In East Godavari - Sakshi

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆదిశేషయ్యను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ఇంటిపన్ను మార్చాలంటే డబ్బు.. ఖాళీస్థలాలకు పన్ను వేయాలంటే చేతులు తడపాల్సిందే.. ఇలా కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ప్రతి పనికీ ముడుపులు వసూలు చేస్తున్న కొంత మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్లు కలెక్టర్ల వ్యవహారశైలి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గడచిన మూడేళ్లలో ఈ విభాగంపై మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగి ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మరో ఇద్దరు బిల్‌ కలెక్టర్లు కేసులో చిక్కుకున్నారంటే ఈ విభాగం పనితీరు ఎంత అవినీతిమయంగా ఉందో అర్థమమవుతోంది.

కాకినాడ: జిల్లా కేంద్రం కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆదిశేషయ్య రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవహారం ఉద్యోగవర్గాల్లో కలకలం రేపింది. కొన్నినెలలుగా అతడి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ ఇంటికి పన్ను వేసేందుకు లంచం డిమాండ్‌ చేసి అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కారు. ఈ విభాగంలో దాదాపు మూడేళ్ల క్రితం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్, బిల్‌ కలెక్టర్‌ విజయ్‌కుమార్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరో ఏడాది తరువాత బిల్‌ కలెక్టర్‌ కృష్ణ కూడా ఇదే తరహాలో లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ ముగ్గురు సస్పెన్షన్‌కు గురై కొద్ది రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరగా మంగళవారం జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆదిశేషయ్య పట్టుబడిన తీరు ఆ శాఖలో కానరాని మార్పునకు అద్దంపడుతోంది.

వాస్తవానికి కొత్తగా ఇల్లు కట్టి పన్ను వేయాలంటే రెవెన్యూశాఖదే కీలకపాత్ర. దరఖాస్తు చేసుకున్న తరువాత స్వయంగా ఇంటికి వెళ్లి ఆ ఇంటి కొలతలు ఆధారంగా ఇంటిపన్నును నిర్ధారిస్తారు. అయితే తక్కువ చదరపు అడుగులు చూపించి యజమానికి తక్కువ పన్ను వేసేలా చేసేందుకు ముడుపులు దిగమింగుతూ కార్పొరేషన్‌ ఆదాయానికి అనేక మంది ఆర్‌ఐ, బిల్‌ కలెక్టర్లు గండికొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్న ఇంటి పై అంతస్తును లెక్కల్లో చూపకపోవడం వంటి చర్యలు ద్వారా కూడా పన్ను చెల్లింపుదారుడికి ఊరటనిస్తూ వీరంతా ముడుపులు రూపంలో దోచుకుంటున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని అనేక ఖాళీ స్థలాలకు పన్నుల విషయంలో అవినీతికి అడ్డూఅదుపులేకుండా పోతోంది. చిన్న పూరిల్లు వేసి ఆ ఇంటికి డోర్‌ నంబర్‌ విధించడం ద్వారా నామమాత్రపు పన్ను పడేలా అనేక మంది సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. ఈ పన్నుకు నాలుగైదింతలు ఖాళీ స్థలాల పన్ను ఉండడంతో వీరికి ఆదాయ మార్గంగా మారి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. తాజాగా పట్టుబడ్డ ఆదిశేషయ్య కేసులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

25 రోజులుగా ముప్పుతిప్పలు
కాకినాడ జగన్నాథపురంలోని హోత చంద్రమౌళి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో ఇల్లుకట్టుకుని పన్ను కోసం కార్పొరేషన్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద మొత్తంలో పన్ను పడుతుందని, రూ.20వేలు ఇస్తే పన్ను తగిస్తానంటూ సదరు భవన యజమానిపై ఆర్‌ఐ ఒత్తిడి పెంచారు. బిల్‌ కలెక్టర్‌తోపాటు వచ్చి కొలతలు తీసుకున్నాక చంద్రమౌళితో బేరంపెట్టి పన్ను వేయకుండా ముప్పుతిప్పలు పెట్టడంతో చివరకు రూ.15వేలుకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ను ఆశ్రయించారు. సదరు ఆర్‌ఐ అవినీతి వ్యవహారానికి మంగళవారం తెరపడింది. ఇదిలా ఉండగా రెవెన్యూ విభాగంలోని అవినీతిపై నిఘాపెట్టిన అధికారులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ట్రెజరీ విభాగాలపై కూడా ఓ కన్నేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

వర్షంలో ఆటోపై వెళ్లి మరీ...
రూ.15వేలు లంచం కోసం ఎడతెరిపిలేని వర్షంలో ఆటోలో వెళ్లి మరీ ఆదిశేషయ్య ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. సొమ్ము తీసుకునేందుకు రమ్మంటూ చంద్రమౌళి నుంచి ఫోన్‌ రావడంతో అక్కడికి వెళ్లగా ఏసీబీ వలపన్ని నగదుతో సహా ఆదిశేషయ్యను పట్టుకుంది. ఈ వ్యవహారంలో బిల్‌కలెక్టర్‌ శివకుమార్‌ పాత్రపై కూడా విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ చెప్పారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్‌ చేస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ దాడిలో డీఎస్పీ వెంట ఇన్‌స్పెక్టర్లు పుల్లారావు, మోహన్‌రావు, తిలక్, ఎస్సై నరేష్‌ తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement