నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి | RJD leader Shot Dead in Nalanda | Sakshi
Sakshi News home page

నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి

Published Wed, Jan 2 2019 2:11 PM | Last Updated on Wed, Jan 2 2019 4:02 PM

RJD leader Shot Dead in Nalanda - Sakshi

పట్నా : రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీకి చెందిన ఇందాల్‌ పాశ్వాన్‌ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అసలేం జరిగిందంటే... సన్నిహితుల కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన ఇందాల్‌కు స్థానిక యువకులతో మంగళవారం వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఇందాల్‌ హత్యతో ఉలిక్కిపడ్డ అతడి సన్నిహితులు.. నిందితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు(13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గత శనివారం వైశాలీ ఏరియాలో పింటూ సింగ్‌ అనే బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అనంతరం కాల్చి చంపేశారు. గయలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. గంజన్‌ ఖేమ్‌కా అనే పారిశ్రామికవేత్త కూడా ఇదే పద్ధతిలో హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కక్షతోనే దుండగులు ఇందాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement