దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. | Road Accident In Nalgonda District | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..

Published Sat, May 12 2018 8:18 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Road Accident In Nalgonda District - Sakshi

ఆస్పత్రి వద్ద రోదిస్తున్న బంధువులు

చౌటుప్పల్‌ (మునుగోడు) : దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వారిలో కుటుంబ పెద్ద మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇ ద్దరు కుమారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మం డల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామ శివారులో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన రాగీరు కిషన్‌(30), భార్య శ్యేత (27) దంపతుల పెళ్లిరోజు కావడంతో దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

తమ కుమారులైన నవక్షిత్‌(4), రక్షిత్‌(2)తో కలిసి ద్విచక్రవాహనంపై రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ సమీపంలోని సంఘీటెంపుల్‌కు వెళ్లారు. దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో దండుమల్కాపురం గ్రామంలోని ఆందోళ్‌మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం శివారులో రోడ్డు వెంట ఉన్న మైలురాయికి బైక్‌ ఢీకొంది. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డారో.. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందో తెలియడం లేదు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య శ్వేత, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కిషన్‌ ఉపాధి నిమిత్తం ముంబాయిలో ఉంటున్నాడు. తన బాబాయి కుమార్తె వివాహం నిమిత్తం ఇరవై రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. త్వరలోనే ముంబాయికి వెళ్లాల్సి ఉండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement