Chotuppal
-
భూ వివాదం: సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
చౌటుప్పల్: భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వెంకన్నగౌడ్, ఎస్ఐ నర్సయ్యపై సస్పెషన్ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్ మెమో జారీ అయింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధిం వివాదం నెలకొంది. దాంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. సదరు కోర్టు ఉత్తర్వులను ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భూమికి యజమానిగా ఉన్న వ్యక్తి ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆశ్రయించాడు. దాంతో కమిషనర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ, ఎస్ఐని సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.(చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) కోర్టు ఉత్తర్వులు ఉన్నా బెదిరించారు: గౌరీబట్ల సురేందర్, బాధితుడు నాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థానిక సీఐ, ఎస్ఐ బెదిరించారు. తాళ్లసింగారం గ్రామంలో 2012 సంవత్సరంలో కొనుగోలు చేసిన 2.33 ఎకరాల భూమి నాపేరిట ఉంది. నేను ఎవరికీ అగ్రిమెంటు చేయలేదు. కానీ కొంత మంది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానిక పోలీసు లను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను. భువనగిరి కోర్టు నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సీఐ, ఎస్ఐ నన్ను బెదిరించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సీపీ మహేష్ భగవత్‌కు అందజేయగా విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారు. -
భోజనం పెట్టేలా చూడండయ్యా...
సాక్షి. చౌటుప్పల్(మునుగోడు) : కుమారులు పట్టించుకోవడం లేదని రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆర్డీఓ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు పాలెం సత్తయ్య(80), అండాలు(70)లకు కుమారులు, కోడళ్లు ఉన్నారు. అయినా బుక్కెడు బువ్వకు నోచుకోవడం లేదు. నడవలేని స్థితిలో ఉన్న వారికి కుటుంబ సభ్యులు కనీస సేవలు సైతం చేయడం లేదు. నోరు తెరిచి అడిగినా పట్టించుకోకపోగా చీదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పరిస్థితిలో మార్పు వస్తుందని ఎంతో కాలంగా ఎదురుచూసినా మార్పు రాకపోవడంతో చట్ట ప్రకారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన మోర గోపాల్, మోర వెంకటేశ్‌ల సహాయంతో ఆటోలో స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉండడంతో అధికారులే ఆటో వద్దకు వచ్చి దంపతుల వివరాలను సేకరించారు. సత్తయ్య–అండాలు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు బాలయ్య మృతిచెందగా కోడలు యశోధ గ్రామంలోనే ఉంటుంది. రెండో కుమారుడు అంజయ్య–యాదమ్మ, మూడో కుమారుడు స్వామి–శోభ ఉన్నారు. రెండో కుమారుడు చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో పని చేస్తుండగా, మూడో కుమారుడు స్థానికంగా కారోబార్‌గా పని చేస్తున్నాడు. వృద్ధ దంపతులకు 1.06 ఎకరాల ప్రభుత్వ భూమి, నివాస గృహం ఉంది. ఆస్తుల పంపిణీ జరిగింది. చిన్నకుమారుడి వాటా ఇంట్లో కేటాయించిన గదిలో వృద్ధులు ఉంటున్నారు. వృద్దులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుత్తా వెంకట్‌రెడ్డి వృద్ధులు కూర్చున్న ఆటో వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కుమారులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా కోడళ్లు నిరాకరిస్తున్నారని వృద్ధులు బోరున విలపించారు. గతంలో ఇద్దరు కుమారులు నెలకు 500రూపాయల చొప్పున ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ ద్వారా వచ్చే రూ.2000తోనే పూటవెళ్లదీసుకుంటున్నామని తెలిపారు. జీవిత చరమాంకంలో ఉన్న తమకు భోజనం పెట్టించడంతో పాటు సేవలు అందించేలా చూడాలని వేడుకున్నారు. ఈ ప్రకారంగా కుమారులు, కోడళ్లకు ఆదేశాలు చేసి తమకు మేలు చేయాలని కోరారు. కాగా కుమారులకు నోటీసులు జారీ చేస్తామని గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపారు. -
హైవేలపై సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్ /కేతేపల్లి/మహబూబ్‌నగర్ నెట్వర్క్: సంక్రాంతి పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లోని పలు జిల్లాల నుంచి అత్యధికంగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్గేట్ల వద్ద విజయవాడ మార్గంలో శనివారం కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా 16 మార్గాలు ఉండగా విజయవాడ వైపు పది ద్వారాలను తెరిచారు. యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద పాస్టాగ్ గేట్ల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వాహనాదా రులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు టోల్ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లక్ష్యం అదే: కేటీఆర్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే కాకుండా దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మూలంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. కాలుష్యరహితమైన ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఈ పార్క్‌లో ఏర్పాటు కానున్నాయని, రసాయనిక, బల్క్‌డ్రగ్స్ పరిశ్రమలకు అవకాశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు కొనుగోలు చేసిన ఔత్సాహికులు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఉత్పత్తులను ప్రారంభించాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీల యాజమానులకు అగ్రిమెంట్లో నిబంధన విధించారు. ఈ పారిశ్రామిక వాడ ద్వారా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఉద్యోగులకు టౌన్షిప్, రెస్టారెంట్లు, డార్మెటరీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఐటీఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వృత్తి నైపుణ్యంతో కూడిన కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈపార్క్‌కు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 442 ఎకరాల భూమి కేటాయించారు. మొత్తం 450 యూనిట్లు రానున్నాయి. ఇందులో 40 యూనిట్లు మహిళలకు కేటాయించారు. రూ.1,553కోట్ల పెట్టుబడితో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్ సైజు 450 మీటర్ల నుంచి 5 ఎకరాల వరకు నిర్ణయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులు రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్లాట్లను తిరిగి స్వాధీనం పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,600కి గజం చొప్పున భూమి ధర నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్లాట్ల కేటాయింపులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.250కోట్ల నిధులు కేటాయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, సబ్సిడీ లభిస్తాయి. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి. ఎలక్ట్రికల్, డ్రిల్లింగ్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్, డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ వంటి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. టీఎస్ఐపాస్తో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం టీఎస్ఐపాస్ –2014 నూతన పారిశ్రామిక విధా నం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్ర భుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ ధరకు భూమి, ప న్నుల్లో రాయితీ, పెట్టుబడుల్లో రాయితీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్ర మల శాఖ ప్రోత్సహిస్తోంది. టీఎస్ఐపాస్ ద్వా రా గడిచిన మూడేళ్లలో జిల్లాలో 482 చిన్న, సూ క్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఆగస్టు 31 వరకు రూ.4,559 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఆయా పరిశ్రమల్లో 17,618మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీఫ్రైడ్, టీఐడియా ద్వారా 231మంది లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహక పథకాలను అందించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.51కోట్లు మంజూరు చేసింది. పరిశ్రమలు స్థాపించే జనరల్ కేటగిరీ వ్యక్తులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 నుంచి 40శాతం, మహిళలకు అదనంగా 10 శాతం రాయితీ, పావలా వడ్డీ ఇస్తున్నారు. జిల్లాకు తరలిరానున్న మరో 300 పరిశ్రమలు హైదరాబాద్ జంటనగరాలనుంచి పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు తరలించా లని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే మరో 300 వరకు పరిశ్రమలు జిల్లాకు రానున్నాయి. పరిశ్రమలు స్థాపించే వారికి సరసమైన ధరలకు భూముల కేటాయింపు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానంతో అనుమతులు జారీ చేస్తారు. -
సెలవు రోజున విధులకు హాజరు
చౌటుప్పల్ : సబ్ రిజిస్టార్ కార్యాలయానికి శనివారం సెలవు అయినప్పటికీ రిజిస్టార్ ఆనంద్ విధులకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు గమనించి కార్యాలయానికి వెళ్లారు. ఏదో జరుగుతుందని ప్రశ్నించారు. కొంతసేపటి తర్వాత వెనుదిరిగారు. కాగా ఈ విషయమై సబ్ రిజిస్టార్ ఆనంద్‌ను వివరణ కోరగా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను స్కానింగ్ చేసే నిమిత్తం వచ్చానన్నారు. కార్యాలయంలో ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డవుతుందని తెలిపారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
చౌటుప్పల్ (మునుగోడు) : దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వారిలో కుటుంబ పెద్ద మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇ ద్దరు కుమారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మం డల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన రాగీరు కిషన్(30), భార్య శ్యేత (27) దంపతుల పెళ్లిరోజు కావడంతో దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ కుమారులైన నవక్షిత్(4), రక్షిత్(2)తో కలిసి ద్విచక్రవాహనంపై రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని సంఘీటెంపుల్‌కు వెళ్లారు. దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో దండుమల్కాపురం గ్రామంలోని ఆందోళ్‌మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం శివారులో రోడ్డు వెంట ఉన్న మైలురాయికి బైక్ ఢీకొంది. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డారో.. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందో తెలియడం లేదు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య శ్వేత, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కిషన్ ఉపాధి నిమిత్తం ముంబాయిలో ఉంటున్నాడు. తన బాబాయి కుమార్తె వివాహం నిమిత్తం ఇరవై రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. త్వరలోనే ముంబాయికి వెళ్లాల్సి ఉండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపునొప్పి భరించలేక..
చౌటుప్పల్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండల పరిధిలోని ఎనగంటితండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరంటోతు రోజా(27)కు ఇటీవల భరించలేని కడుపునొప్పి వస్తుంది. నొప్పి రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో తీవ్రఒత్తిడికి గురైన రోజా తన ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చౌటుప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని శాంసంగ్ షోరూమ్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్న సమయంలో షాపు వెనుక భాగంలో చెత్తను తగలబెట్టెందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు పక్కనే ఆనుకుని ఉన్న శాంసంగ్ షోరూంకు అంటుకున్నాయి. రెప్పపాటు కాలంలో మొదటి అంతస్తుకు వ్యాపించడంతో షాపులో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు అంటుకున్న సమయంలో సుమారు వందకుపైగా టీవీలు, శాంసంగ్ బ్రాండ్‌కు పలు రకాల వస్తువులు షోరూంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కలిగినట్టు సమాచారం.