సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిరప కోత కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఇవాళ సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కూలీ పనులు ముగిసిన అనంతరం కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపడి ట్రాక్టర్ మీద పడటంతో పాటు, విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మృతులు మాచవరం ఎస్సీ కాలనీకి చెందినవారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మాచవరం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రకాశం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment