దొంగతనం జరిగిన ఇల్లు
రాజేంద్రనగర్: చల్లటి గాలికోసం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న కిటికీని తెరిచి ఉంచగా ఆ కిటికీలోంచి దొంగలు దూరి ఇల్లును కాజేసిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన కొత్త జంట విజయ్, అనూష. వీరిద్దరికి 20 రోజుల కిందట వివాహమవడంతో హైదర్షాకోట్‌లోని మాధవీనగర్‌లో కొత్త కాపురం పెట్టారు. స్థానికంగా వీరి బంధువులు ఉండడంతో ఇంటిని కోనుగోలు చేసి నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్ శనివారం ఉద్యోగానికి వెళ్లి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు భోజనాలు పూర్తిచేసుకొని నిద్రపోయారు.
వేడి ఎక్కువగా ఉండడంతో తలుపు పక్కనే ఉన్న కిటికీని చల్లగాలి కోసం తెరిచి ఉంచారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విజయ్‌కి ఫోన్ రావడంతో బయటకు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. బయట నుంచి గడియ ఉండడంతో పక్క ఇంట్లోని బంధువులకు ఫోన్‌చేసి గడియ తీయించాడు. అయితే ఆ తర్వాత లేచిన అనూష బాల్కాని పక్కనే ఖాళీ స్థలంలో తన ఆభరణాల ఖాళీ డబ్బాలు పడి ఉండడంతో గమనించింది. వెంటనే భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగింది అని గ్రహించి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. మాదాపూర్ డీసీపీ వెంకట్‌రావు, ఏసీపీ శ్యామ్‌సుందర్‌తో పాటు క్లూస్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్లంబర్‌పై అనుమానం
అయితే ఈ దొంగతనానికి పాల్పడింది ప్లంబర్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ శనివారం మధ్యాహ్నం ఓ ప్లంబర్‌ను పిలిపించి బాత్‌రూమ్‌లో వాటర్ హీటర్‌ను బిగించే పనిని చెప్పాడు. పనులు చేసి వెళ్లిన ప్లంబర్‌పైనే అనుమానం ఉందని విజయ్ తెలిపాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment