స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును చూపుతున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌లో ఉంటున్న నేరగాడి మార్గదర్వనంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్ణాటక, మహారాష్ట్రా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ఘరానా దొంగల ముఠాను సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, మూడు కిలోల వెండి ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో కీలక నిందితుడైన ఖలీల్ గతంలో 19సార్లు పోలీసులకు చిక్కాడు. అతడిపై 84 కేసులు ఉన్నట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలాతో కలిసి సీసీ వీసీ సజ్జనార్ బుధవారం వివరాలు వెల్లడించారు.
జైలలోనే ముఠా ఏర్పాటు...
చోరీ కేసులో అరెస్టైన ఖలీల్, శివలకు జైల్లో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ కలిసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. 2016లో చిలకలగూడ పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే సయమంలో ఆయుధాల చట్టం కింద తప్పాచబుత్ర పోలీసులకు చిక్కి జైల్లో ఉన్న నగరానికి చెందిన మీర్ సజ్జద్ ఆలీతో ఖలీల్, శివలకు పరిచయం ఏర్పడింది. మీరు చోరీలు చేస్తే ఆ సొత్తును తాను విక్రయిస్తాననని సజ్జద్ ఆలీ వారితో ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం 2017 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలైన సజ్జద్ ఆ తర్వాత ఖలీల్, శివలను జైలు నుంచి విడిపించాడు. అనంతరం దుబాయ్‌కు వెళ్లిన సజ్జద్ పర్యవేక్షణలో అతని అనుచరులతో కలిసి ఖలీల్, శివ పలు చోరీలకు పాల్పడ్డారు.
చోరీ చేసిన వాహనంలోనే రెక్కీలు..
ఖలీల్, శివ బైక్ లేదా కారు చోరీ చేసేవారు. అదే వాహనంలో తాము ఎంచుకున్న పట్టణాలు, నగరాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున మూడు గంటల మధ్యలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఇళ్లలో కారు తాళాలు కనిపిస్తే ఆ వాహనాన్ని తీసుకెళుతూ అంతకుముందు చోరీ చేసిన కారును నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి ముంబైకి పారిపోయేవారు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు కారు నంబర్ ప్లేట్‌ను తరచూ మార్చేవారు. చోరీ చేసిన సొత్తు వివరాలపై దుబాయ్‌లో ఉంటున్న సజ్జద్ ఆలీకి సమాచారం అందించేవారు. అతడి సూచన మేరకు ముంబైలో ఉంటున్న అతని అనుచరులు సాగర్ సంజీవ్ పగరే, సయ్యద్ కర్రార్ హుస్సేన్ రజ్వీ, మీర్ ముస్తాఫా ఆలీ రజ్వి, అజీజ్ అహ్మద్ ఖాన్, ముజ్జూలతో పాటు అతని సోదరుడు అస్గర్ ఆలీకి అప్పగించేవారు. కొన్ని సందర్భాల్లో వీటిని విక్రయించగా వచ్చిన సొమ్మును సజ్జద్ ఆలీ స్నేహితుల ద్వారా పంపేవాడు. ఖలీల్, శివలతో పాటు తన అనుచరులకు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా నగదు పంపేవాడు.
మనమే విక్రయిద్దామన్నందుకు..
చోరీ సొత్తును సజ్జద్ ఆలీకి పంపే బదులు మనమే స్థానికంగా విక్రయించి సొమ్ము చేసుకుందామని శివ ఖలీల్ వద్ద ప్రతిపాదన చేశాడు. ఈ విషయాన్ని ఖలీల్ సజ్జద్ ఆలీ దృష్టికి తీసుకెళ్లడంతో అతడిని హత్య చేయాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా గత మార్చిలో శివను జాల్నాలోని గుందేవాడి శివారు ప్రాంతానికి తీసుకెళ్లిన ఖలీల్ మద్యం తాగించి రాళ్లతో కొట్టి చంపేశాడు. జాల్నా ఠాణాలో నమోదైన కేసులో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఖలీల్ ముఠా సభ్యులు చిక్కడంతో ఈ కేసు పరిష్కారమైంది. శివ హత్య అనంతరం ఖలీల్, తన స్నేహితుడు మహమ్మద్ సర్వర్, సజ్జద్ ఆలీ మిత్రుడు సయ్యద్ జర్రర్ ఆలీ అబేడిలతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్, మియాపూర్, నేరేడ్‌మెట్, వనస్థలిపురం, వికారాబాద్, మహబూబ్‌నగర్, కొత్తకోట, వనపర్తి, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతాల్లో 84 చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల రాజేంద్రనగర్, మియాపూర్ ప్రాంతాల్లో జరిగిన చోరీలను సవాల్‌గా తీసుకున్న శంషాబాద్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్, బాలానగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాస్ నేతత్వంలోని బృందం పక్కాగా నిఘా వేసి బుధవారం రాజేంద్రనగర్ పరిధిలో మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ సర్వర్, సయ్యద్ జర్రర్ ఆలీ అబేది, మీర్ ముజాఫర్ ఆలీ, షేక్ రాజ్యా, షేక్ సల్మాన్‌లను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న సజ్జద్ ఆలీ, అస్గర్‌ఆలీని పట్టుకునేందుకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment