గుత్తి: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కాచిగూడ (12798) వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి 12 గంటలకు గుత్తి జంక్షన్ పరిధిలోని జూటూరు–రాయలచెరువు స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో దొంగల గుంపు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ కనిపించక లోకో పైలెట్ రైలును నిలిపి వేశాడు. వెంటనే సుమారు 10 నుంచి 15 మంది దుండగులు రైల్లోకి చొరబడ్డారు. ఎస్–10, 11, 12 ఏసీ బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను కొట్టి, మారణాయుధాలు చూపి బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. సుమారు అరగంట పాటు దుండగులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు.
ఆ సమయంలో యర్రగుంట్లకు చెందిన ఇద్దరు జీఆర్‌పీ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నా దొంగలను నిలువరించలేకపోయారు. ఆ తర్వాత గంటకే గుత్తికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (నిజామబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు నం.12794)లో కూడా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే దొంగలు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపేశాడు. ఆ వెంటనే దొంగలు ఎస్–4, 5, 6, 12 బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ బేగం బజారుకు చెందిన ప్రయాణికులు చంద్రమోహన్, జయప్రకాశ్, నాందేడ్‌కు చెందిన నితిన్ ఎరివార్, ఫాతిమా, రేష్మా గుత్తి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీపై కొందరు ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు ఉన్నా దోపిడీ దొంగలను నిలువరించలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా బేగంబజార్‌కు చెందిన రేష్మా(23) మెడలోంచి 11 తులాలు, నాందేడ్‌కు చెందిన మయూరి వద్దనుంచి 1 తులం, కడపకు చెందిన ఫాతీమా వద్ద బ్యాగులో నుంచి రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆగగానే శుక్రవారం వారు రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మెడలో చైన్ లాక్కెళ్లారు
అర్ధరాత్రి సమయం కావడంతో నాతో పాటు ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నాం. దొంగలు దొంగలు అనే అరుపులు వినిపించడంతో ఉలిక్కి పడి లేచాను. అప్పటికే దొంగలు నా ముందు నిలబడి ఉన్నారు. మెడలోని చైన్ లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు.
– జయప్రకాశ్, హైదరాబాద్
చంపుతామని బెదిరించారు
ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నాను. కాపాడండీ కాపాడండీ అంటూ అరుపులు వినిపించాయి. లేచి చూసే సరికి సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. చంపుతారని భయపడ్డా. వెంటనే నా ఉంగరం, వాచీ, కొంత నగదు దొంగలకు ఇచ్చేశాను.
– చంద్రమోహన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment