rayalaseema express
-
పట్టాలు తప్పిన ట్రైన్.. వికారాబాద్ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు
బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్ తరలిస్తున్నారు. చదవండి: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి -
రెండు రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం
గుత్తి: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కాచిగూడ (12798) వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి 12 గంటలకు గుత్తి జంక్షన్ పరిధిలోని జూటూరు–రాయలచెరువు స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో దొంగల గుంపు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ కనిపించక లోకో పైలెట్ రైలును నిలిపి వేశాడు. వెంటనే సుమారు 10 నుంచి 15 మంది దుండగులు రైల్లోకి చొరబడ్డారు. ఎస్–10, 11, 12 ఏసీ బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను కొట్టి, మారణాయుధాలు చూపి బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. సుమారు అరగంట పాటు దుండగులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ సమయంలో యర్రగుంట్లకు చెందిన ఇద్దరు జీఆర్పీ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నా దొంగలను నిలువరించలేకపోయారు. ఆ తర్వాత గంటకే గుత్తికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (నిజామబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు నం.12794)లో కూడా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే దొంగలు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపేశాడు. ఆ వెంటనే దొంగలు ఎస్–4, 5, 6, 12 బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ బేగం బజారుకు చెందిన ప్రయాణికులు చంద్రమోహన్, జయప్రకాశ్, నాందేడ్‌కు చెందిన నితిన్ ఎరివార్, ఫాతిమా, రేష్మా గుత్తి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీపై కొందరు ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు ఉన్నా దోపిడీ దొంగలను నిలువరించలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా బేగంబజార్‌కు చెందిన రేష్మా(23) మెడలోంచి 11 తులాలు, నాందేడ్‌కు చెందిన మయూరి వద్దనుంచి 1 తులం, కడపకు చెందిన ఫాతీమా వద్ద బ్యాగులో నుంచి రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగగానే శుక్రవారం వారు రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడలో చైన్ లాక్కెళ్లారు అర్ధరాత్రి సమయం కావడంతో నాతో పాటు ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నాం. దొంగలు దొంగలు అనే అరుపులు వినిపించడంతో ఉలిక్కి పడి లేచాను. అప్పటికే దొంగలు నా ముందు నిలబడి ఉన్నారు. మెడలోని చైన్ లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు. – జయప్రకాశ్, హైదరాబాద్ చంపుతామని బెదిరించారు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నాను. కాపాడండీ కాపాడండీ అంటూ అరుపులు వినిపించాయి. లేచి చూసే సరికి సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. చంపుతారని భయపడ్డా. వెంటనే నా ఉంగరం, వాచీ, కొంత నగదు దొంగలకు ఇచ్చేశాను. – చంద్రమోహన్, హైదరాబాద్ -
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్/ ఇందల్వాయి: నిజామా బాద్– తిరుపతిల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ ప్రెస్ (12793) రైలు పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తుం డగా నిజామాబాద్ జిల్లా ఇంద ల్వాయి మండలం సిర్నాపల్లి స్టేషన్‌కు సమీపంలో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 16 బోగీలున్న ఈ రైలులో ఏసీ త్రీటైర్ (బీ1) బోగి వీల్‌త్రెడ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బోగీకి చెందిన ముందు చక్రాలు పట్టాలు తప్పి ఒక టిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఒక్కసారిగా దుమ్ము రేగడంతో ప్రమా దాన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు మరో కిలో మీటరు దూరంలో వాగుపై వంతెన ఉంది. ఇలాగే ముందుకు వెళ్లి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు ప్రమా దానికి గల కారణాలపై ఇంజనీరింగ్ నిపుణుల బృందంతో విచారణ చేపట్టామని ఎస్సీఆర్ డీఆర్ఎం ఆరుణ్ కుమార్ జైన్, ఏజీఎం థామస్ జార్జ్ తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బోగీలు కావడంతో బోగి బోల్తాపడ లేదన్నారు. ప్రమాద సమయంలో ట్రైన్ వేగం 110 కి.మీ.లు ఉండవచ్చన్నారు. పలు రైళ్లు రద్దు.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్– నిజామా బాద్–ముంబయి రూట్లలో నాలుగు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. సబల్‌పూర్–నాందేడ్ రైలు, ముంబయి, సికింద్రాబాద్ రైళ్లను వికారా బాద్ జిల్లా మీదుగా దారి మళ్లించారు. మేడ్చల్–నాందేడ్ రైలు, బోధన్– మిర్జాపల్లి, కాచిగూడ–మన్మాడ్, కాచిగూడ–నిజామాబాద్, మిర్జాపల్లి–బోధన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరమ్మతులు చేసి, సాయంత్రం నుంచి రాకపోకలు కొనసాగించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ప్రయాణికులను ఆటోల్లో, స్కూల్ బస్సుల్లో జాతీయ రహదారిపై ఉన్న ఇందల్వాయి మండల కేంద్రానికి తరలించారు. బీ1 బోగిని తొలగించి మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించి ట్రైన్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పంపించారు. కొందరిని కామారెడ్డి స్టేషన్‌కు తరలించారు. -
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
-
నిజామాబాద్ వరకూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్
తిరుపతి అర్బన్ : తిరుపతి నుంచి తెలంగాణలోని హైదరాబాద్ (నాంపల్లి) వరకూ ప్రస్తుతం 17430 నంబరుతో నడుస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు ఇక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దీనిని నిజామాబాద్ వరకూ పొడిగించి రిజర్వేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. నవంబర్ ఒకటి నుంచి తిరుపతిలో బయలుదేరి నిజామాబాద్ వరకూ వెళ్లనుంది. గతంలో తెలంగాణకు చెందిన నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు తిరుపతికి రైలు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు రైల్వేశాఖ నిజామాబాద్ వరకూ పొడిగించింది. రైలు వెళ్లే మార్గాలివే.. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 12793 నంబరుతో తిరుపతి నుంచి నిజామాబాద్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో 12794 నంబరుతో నిజామాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. గతంలో వెళ్లిన నాంపల్లితో సంబంధం లేకుండా బేగంపేట, సికింద్రాబాద్, మేడ్చల్ మీదుగా నిజామాబాద్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధంచేశారు. 14 బోగీలు.. 1051 బెర్తులు ఈ రైలులో 7 స్లీపర్ క్లాస్ బోగీల్లో 504 బెర్తులు, ఒక సెకండ్ ఏసీ బోగీలో 48 బెర్తులు, ఒక త్రీటైర్ ఏసీలో 67 బెర్తులు, 4 జనరల్ బోగీల్లో 432 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు 16 గంటల సమయం పడుతుంది. ఈ రైలు తిరుపతిలో రోజూ సాయంత్రం 4.25 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 5.15 గంటలకు సికింద్రాబాద్, ఉదయం 08.20 గంటలకు నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ నుంచి మధ్యాహ్నం 02.05 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.25 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. -
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్లో మరో రైలు పట్టాలు తప్పింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్లు దిగిపోయిన తర్వాత యార్డుకు తీసుకెళ్తుండగా ఇంజిన్ వెనుక ఉన్న బోగీ పట్టాలు తప్పింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత వారం ఇదే రైల్వేస్టేషన్లో వెంకటాద్రి ఎక్సెప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ రోజు మళ్లీ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మూడు రైళ్లలో దొంగల బీభత్సం
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిగ్నల్ కోసం ఆగి ఉన్న రైళ్ల పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఇదే అదునుగా చేసుకొని మూడు రైళ్లలోని నాలుగు భోగీలలో చోరీలకు పాల్పడ్డారు. వివరాలు.. నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు అనంతరం బోగీలలోకి చొరబడి ప్రయాణికుల నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఇదే విధంగా దాడి చేసిన దుండగులు 4 బోగీల్లోని దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ముంబాయి నుంచి బెంగళూరు వెళ్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో కూడా దోపిడీకి దిగారు. దీంతో బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న లోకో పైలట్ భాస్కర్ దొంగలను ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో దొంగలు అతని పై దాడికి దిగారు. దీంతో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ప్రయాణికుడు గాయపడ్డారు. ఈ మూడు ఘటనలలో సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సుమారు10 మంది దుండగులు అకస్మాత్తుగా వచ్చి కత్తులతో బెదిరించి దాడి చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరిగిన అధికారులు కళ్లు తెరవకపోవడం గమనార్హం.