Venkatadri Express train
-
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
రేణిగుంట (చిత్తూరు జిల్లా): కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. రెండు బోగీల మధ్య లింకు ఊడిపోవడంతో కొన్ని బోగీలు రైలు నుంచి వేరుపడి నిలిచిపోయాయి. వివరాలు.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు రేణిగంట మండలం మామండూరు రైల్వేస్టేషన్ దాటాక అకస్మాత్తుగా ఎస్2, ఎస్3 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో ఎస్3 నుంచి వెనుకవైపున్న బోగీలు వేరుపడి నిలిచిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించే లోపు రైలు అరకిలోమీటర్ దూరం ప్రయాణించింది. అప్రమత్తమైన లోకోపైలట్లు రైలును విడిపోయిన బోగీల వద్దకు వెనక్కి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న మామండూరు స్టేషన్ మాస్టర్లు సిబ్బందితో రైలు వద్దకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.దీంతో 8.25 గంటలకు రైలు రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంది. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
సాక్షి, కర్నూలు : చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్లో రైలింజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం. -
రెండు రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం
గుత్తి: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కాచిగూడ (12798) వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి 12 గంటలకు గుత్తి జంక్షన్ పరిధిలోని జూటూరు–రాయలచెరువు స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో దొంగల గుంపు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ కనిపించక లోకో పైలెట్ రైలును నిలిపి వేశాడు. వెంటనే సుమారు 10 నుంచి 15 మంది దుండగులు రైల్లోకి చొరబడ్డారు. ఎస్–10, 11, 12 ఏసీ బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను కొట్టి, మారణాయుధాలు చూపి బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. సుమారు అరగంట పాటు దుండగులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ సమయంలో యర్రగుంట్లకు చెందిన ఇద్దరు జీఆర్పీ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నా దొంగలను నిలువరించలేకపోయారు. ఆ తర్వాత గంటకే గుత్తికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (నిజామబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు నం.12794)లో కూడా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే దొంగలు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపేశాడు. ఆ వెంటనే దొంగలు ఎస్–4, 5, 6, 12 బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ బేగం బజారుకు చెందిన ప్రయాణికులు చంద్రమోహన్, జయప్రకాశ్, నాందేడ్‌కు చెందిన నితిన్ ఎరివార్, ఫాతిమా, రేష్మా గుత్తి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీపై కొందరు ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు ఉన్నా దోపిడీ దొంగలను నిలువరించలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా బేగంబజార్‌కు చెందిన రేష్మా(23) మెడలోంచి 11 తులాలు, నాందేడ్‌కు చెందిన మయూరి వద్దనుంచి 1 తులం, కడపకు చెందిన ఫాతీమా వద్ద బ్యాగులో నుంచి రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగగానే శుక్రవారం వారు రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడలో చైన్ లాక్కెళ్లారు అర్ధరాత్రి సమయం కావడంతో నాతో పాటు ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నాం. దొంగలు దొంగలు అనే అరుపులు వినిపించడంతో ఉలిక్కి పడి లేచాను. అప్పటికే దొంగలు నా ముందు నిలబడి ఉన్నారు. మెడలోని చైన్ లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు. – జయప్రకాశ్, హైదరాబాద్ చంపుతామని బెదిరించారు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నాను. కాపాడండీ కాపాడండీ అంటూ అరుపులు వినిపించాయి. లేచి చూసే సరికి సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. చంపుతారని భయపడ్డా. వెంటనే నా ఉంగరం, వాచీ, కొంత నగదు దొంగలకు ఇచ్చేశాను. – చంద్రమోహన్, హైదరాబాద్ -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
రెండు రోజులపాటు ప్రజలతో మమేకం 8న ఉదయం సాగు,తాగునీటిపై సమీక్ష సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన వివరాలను బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాదులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం రాత్రి బయలుదేరి గురువారం తెల్లవారుజామున ముద్దనూరులో దిగుతారని ఆయన వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుని గురువారమంతా క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకుంటారన్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వచ్చి వైఎస్ జగన్‌ను కలుసుకుంటారని వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పులివెందుల నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, ఇతర అధికారులతో సాగు, తాగునీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమీక్ష అనంతరం పులివెందుల కార్యాలయంలోనే ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర కార్యక్రమాలకు వైఎస్ జగన్ వెళ్లాల్సి వస్తే పర్యటనలో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు.