నేడు పులివెందులకు వైఎస్ జగన్
రెండు రోజులపాటు ప్రజలతో మమేకం
8న ఉదయం సాగు,తాగునీటిపై సమీక్ష
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన వివరాలను బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాదులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం రాత్రి బయలుదేరి గురువారం తెల్లవారుజామున ముద్దనూరులో దిగుతారని ఆయన వెల్లడించారు.
అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుని గురువారమంతా క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకుంటారన్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వచ్చి వైఎస్ జగన్‌ను కలుసుకుంటారని వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పులివెందుల నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, ఇతర అధికారులతో సాగు, తాగునీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమీక్ష అనంతరం పులివెందుల కార్యాలయంలోనే ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర కార్యక్రమాలకు వైఎస్ జగన్ వెళ్లాల్సి వస్తే పర్యటనలో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు.