Signaling system
-
ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిచిన రైళ్లు.. కారణం ఇదే
సాక్షి, హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్-నాగ్‌పుర్ వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించారు.సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేశారు.ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
కలలు మాని... కళ్ళు తెరవాలి!
ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లో జనం బక్రీద్ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్ పైలట్, కో–పైలట్ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్ ఛైర్పర్సన్ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్ మాస్టర్ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. -
సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైందని ప్రశ్నించిన సీఎం.. ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరారు. ‘‘దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి. నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది. ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?’’ అంటూ ట్విట్టర్లో సీఎం జగన్ ప్రశ్నించారు. The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 -
అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!
నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం. దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్ఎస్ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్‌కతా ‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్’ అప్ – లూప్ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్ రైలును గుద్దుకుంది. అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎస్ అండ్ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం. ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్ఎస్ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్ లోపం తలెత్తింది. దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్ బోర్డ్‌పై దాన్ని మార్క్ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్ షిఫ్టింగ్ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్ ఫాల్ట్ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అలాగే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్ డయా గ్రమ్ను మార్చి ఉన్నా రాంగ్ సిగ్నలింగ్ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్ అండ్ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్. రైళ్ళను నియంత్రించే మెకానిజమ్‌లు, అలాగే లెవల్ క్రాసింగ్లకు సంబంధించిన సిగ్నలింగ్ సామగ్రి అయిన ‘రిలే హట్స్’ ఈ రిలే రూమ్‌లలోనే ఉంటాయి. అలాంటి రూమ్ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్ఎస్ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్‌కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం. ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్ఎస్ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి. లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్ఎస్ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్‌లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. -
మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్
కోల్కత్తా: ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా రెండు గూడ్స్ రైళ్లు పట్టాలపై ఢీకొన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో బంకూర ప్రాంతంలోని ఓండా స్టేషన్ వద్ద లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. 12 బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్‌కు గాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పలు రైళ్లు రద్దు.. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. #ser #IndianRailways pic.twitter.com/WtvccLPEyR — South Eastern Railway (@serailwaykol) June 25, 2023 ఇది కూడా చదవండి: ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన! -
రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
ఒడిశా:ఒడిశా రైలు ప్రమాద ఘటనతో మేల్కొన్న రైల్వే శాఖ రైళ్ల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు నడవడానికి కీలకంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థలను రెండేసి తాళాలు వేసి రక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్‌లు, రిలే హట్లు,లెవల్ క్రాసింగ్ టెలికమ్యునికేషన్ పరికరాలు, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్‌లను జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరికరాలు ఉండే వ్యవస్థకు రెండు తాళాలు వేసైనా కాపాడాలని తీర్మానించింది.ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో దుండగులు చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు తాళాలు విధానం తీసుకువచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్దే ఉంచాలని రైల్వే బోర్డు తెలిపింది. ఏ తాళాన్ని ఎవరు వేశారు? ఎవరు తీశారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పేర్కొనే విధంగా ఓ పట్టికతో కూడిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కాగా.. ఒడిశా రైలు ప్రమాదంలో 280 మంది మరణించారు. 12 వందలకు పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ చదవండి:ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు? -
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టం..భద్రతకు భరోసా
ఒడిశా రైలు దుర్ఘటనకు ప్రధాన కారణం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఒకే ట్రాక్‌పై ప్రయాణించే రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా కవచ్ అనే ఆధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒడిశా ప్రమాద ఘటనకు కవచ్ వ్యవస్థతో సంబంధం లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్(ఈఐ) వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. బాధ్యులను గుర్తించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, రైలు సేఫ్టీ కమిషనర్ త్వరలో నివేదిక అందజేస్తారని వెల్లడించారు. సిగ్నలింగ్‌లో లోపాల కారణంగానే రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దాని వల్ల రైళ్లు ఎంత భద్రం? అనేది తెలుసుకుందాం.. ఏమిటీ లాకింగ్ సిస్టమ్ ► రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో ఇదొక అంతర్భాగం. నిర్దేశిత మార్గాల్లో రైళ్లు క్షేమంగా రాకపోకలు సాగించేలా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రిస్తారు. ► గతంలో మెకానికల్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు ఉండేవి. వాటి ఆధునిక రూపమే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్. ► సంప్రదాయ ప్యానెల్ ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్‌తో పోలిస్తే ఈ అధునాతన వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ► సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులైనా సులభంగా చేసుకోవచ్చు. ► ఇది ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. విస్తృతమైన ప్రయోగ పరీక్షల తర్వాతే దీన్ని తీసుకొచ్చారు. ► ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నళ్లు, పాయింట్లు, ట్రాక్ సర్క్యూట్లు వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందుకోసం కంప్యూటర్లు, ప్రోగ్రామ్బుల్ లాజిక్ కంట్రోలర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సెన్సార్లు, ఫీడ్ బ్యాకింగ్ పరికరాలు ఉపయోగిస్తారు. ► రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రమాదాల జరగకుండా నియంత్రించడానికి వీలుంటుంది. ► ఒకే ప్రాంతంలో ఒకే పట్టాల(ట్రాక్)పై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తుంది. రైళ్లకు ట్రాక్‌లను కేటాయించే వ్యవస్థ ఇది. ► ఒక మార్గంలో ప్రయాణం పూర్తి సురక్షితం అని తేలేదాకా రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రైలు ప్రమాదాలు, పరస్పరం ఢీకొనడం వంటివి చాలావరకు తగ్గిపోయాయి రైళ్ల భద్రతే లక్ష్యంగా... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ రైళ్ల భద్రతే లక్ష్యంగా పని చేస్తుంది. రైళ్ల రాకపోకలు, సిగ్నల్స్, ట్రాక్స్‌ను నియంత్రించడానికి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఒకప్పుడు మనుషులు చేసిన పనిని ఇప్పుడు కంప్యూటర్ల సాయంతో నిర్వర్తిస్తున్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 45 శాతానికి పైగా స్టేషన్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. రైల్వేల ఆధునికీకరణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. 2022–23లో కొత్తగా 347 స్టేషన్లలో ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దేశంలో బ్రాడ్‌గేజ్(బీజీ) మార్గాల్లో 6,506 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో 6,396 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఒడిశాలో ప్రమాదం జరిగిన బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌లోనూ ఈ వ్యవస్థ ఉంది. వైఫల్యాలు ఎందుకు? ► ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ సమర్థంగా పనిచేయడమే కాదు, మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ► ఈ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే సిగ్నల్ వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతుంది. తద్వారా రైలు నడిపించే లోకో పైలట్‌కు తక్షణమే సంకేతం అందుతుంది. ► ఒకవేళ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెందితే అందుకు బహిర్గత పరిస్థితులు, మానవ చర్యలే చాలావరకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఒడిశా ఘటనలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో నార్మల్ లైన్‌పై పాయింట్ సెట్ చేయాల్సి ఉండగా, లూప్‌లైన్‌పై చేశారని, మానవ ప్రమేయం లేకుండా ఇది జరిగేది కాదని సిగ్నలింగ్ నిపుణుడొకరు చెప్పారు. ► రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తవ్వకాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దానివల్ల అక్కడ సిగ్నలింగ్‌కు సంబంధించిన వైర్లు దెబ్బతినడం లేదా షార్ట్ సర్క్యూట్ జరగడం, ఫలితంగా రైలుకు సరైన సంకేతం ఇవ్వడంలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెంది ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వే ఇక మేడిన్ ఇండియా
న్యూఢిల్లీ : స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే వాడాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే దిగుమతులను సంపూర్ణంగా తగ్గించిందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. చైనాకు చెందిన సంస్థ నుంచి సిగ్నలింగ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక రైల్వేలో దిగుమతులు సున్నా స్థాయికి చేరుకున్నాయని యాదవ్ చెప్పారు. రైల్వేలలో దిగుమతుల్ని నిలిపివేయడమే కాకుండా, రైల్వే ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే టెండర్లకు ఇక స్వదేశీ సంస్థలకే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. రైల్వేలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా కంపెనీలపై నిషేధం విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అధిక భాగం స్వదేశీ బిడ్డర్లకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గత రెండు, మూడేళ్లుగా దిగుమతుల్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. -
సిగ్నల్ పడింది.. పాయింట్ తప్పింది
రాజంపేట : తిరుపతి నుంచి షిర్డి (17417) వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. రైల్వేకోడూరు స్టేషన్లో మంగళవారం సిగ్నల్ పడగానే డ్రైవర్ రైలును కదిలించారు. రైలింజన్ పాయింట్ దాటింది. అయితే వెనుక ఉన్న ఎస్ఎల్ఆర్ (బోగీ) పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఎస్‌అండ్‌టీ జేఈ సస్పెన్షన్ ఇందులో భాగంగా సిగ్నల్ సాంకేతిక వ్యవస్థకు సంబంధించిన ఎస్‌అండ్‌టీ శాఖ జేఈ మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ గుంతకల్ డీఎస్టీఈ బీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈయనతోపాటు పర్మినెంట్ వే డిపార్టుమెంట్‌కు చెందిన అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. గుంతకల్ ఏడీఆర్ఎం సైమన్ ప్రమాదం జరిగిన వెంటనే ఈ మార్గంలో ఇన్స్పెక్షన్కు వచ్చిన సందర్భంగా నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తొలగిన క్లాంపర్... తిరుపతి నుంచి వచ్చిన షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేకోడూరు స్టేషన్లో నాలుగో లైనులో తీసుకున్నారు. సెకండ్ ప్లాట్‌ఫాంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ రైలుకు సిగ్నల్ వేశారు. అయితే రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే కట్‌పాయింట్ దాటుకొని రైలింజన్ వెళ్లింది. ఇదే క్రమంలో క్లాంపర్ సరిగా లేకపోవడంతో రెండోబోగీ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన లోకోఫైలెట్ రైలు నిలిపివేశారు. రైలు వేగంగా వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత ఎస్‌అండ్‌టీ విభాగానిదే అని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై విచారణ .. తిరుపతి–షిర్డి రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేయనున్నారు. రైలు ప్రమాదాలకు గల కారణాలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. ఈ ప్రమాదాన్ని రైల్వేశాఖ సీరియస్‌గా తీసుకోనుంది. -
పట్టాలెక్కని ‘టీకాస్’!
తాండూరు : అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రెయిన్ కొలిజెన్ అవాయిడింగ్ సిస్టం (టీకాస్)ను రైల్వే శాఖ అమలు చేసి ఉంటే సోమవారం హైదరాబాద్‌లో ఒకే ట్రాక్‌పై ప్రయాణించిన రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా లేదా వెనుక నుంచి రైళ్లు ఢీకొని సంభవించే ప్రమాదాలను నివారించే టీకాస్ సాంకేతికతను గతంలోనే రైల్వే శాఖ విజయవంతంగా ప్రయోగించింది. భారతీయ రైల్వే వ్యవస్థకు అనుగుణంగా రూపొందించిన ఈ టీకాస్‌ను రెండేళ్ల క్రితమే అమల్లోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ పరిజ్ఞానాన్ని పట్టాలెక్కించడంపై పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నో సదుపాయాలతో రూపొందించిన టీకాస్ అమలుపై ఇటు రైల్వే శాఖ గానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో తరచూ రైలు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. మూడు జంక్షన్ల మధ్య ప్రయోగాలు.. యూరప్ దేశాల్లో అమల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మించి భారత రైల్వే పరిశోధన సంస్థ(ఆర్డీఎస్వో) రూపొందించిన డిజైన్‌తో కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్ కంపెనీల ఆధ్వర్యంలో 2012 నుంచి 2014లో ఏడాదిన్నరపాటు సుమారు రూ.40 కోట్ల వ్యయంతో వికారాబాద్–వాడీ, వికారాబాద్–బీదర్, వికారాబాద్–లింగంపల్లి జంక్షన్ల మధ్య రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాలు జరగకుండా వివిధ అంశాల్లో టీకాస్ ప్రయోగాలు చేశారు. మూడు జంక్షన్ల మధ్య కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్ కంపెనీలు ఏర్పాటు చేసిన టీకాస్ సాంకేతిక పరికరాల అనుసంధాన ప్రక్రియ ముగిసింది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ అధికారులు గతంలోనే ప్రకటించారు. కర్ణాటక సరిహద్దులో ప్రయోగాలు.. వికారాబాద్ జిల్లా తాండూరు–బషీరాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కర్ణాటక సరిహద్దులోని మంతట్టి, నవాంద్గీ రైల్వేస్టేషన్లో చేసిన టీకాస్ ప్రయోగాలను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు కంపెనీల సాంకేతిక పరికరాల మధ్య అనుసంధానం ప్రక్రియ ముగిసిన తక్షణమే బోర్డు, ప్రభుత్వం అనుమతితో ఏడాదిలోపు టీకాస్‌ను అమల్లోకి తెస్తామని ప్రకటించారు. బ్లాక్‌బాక్స్ తరహాలో.. రైలు ఇంజిన్‌లో ఏర్పాటు చేసే టీకాస్ బాక్స్‌ను విమానాల్లో ఉపయోగించే బ్లాక్‌బాక్స్ తరహా ప్రమాణాలతో తయారు చేశారు. రైలు ప్రమాదానికి గురైనా అందులోని టీకాస్ బాక్స్ దెబ్బతినకుండా పనిచేస్తూ, ఆ మార్గంలో వచ్చే ఇతర రైళ్లు ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రైల్వే లెవల్ క్రాసింగ్(గేట్)లు, మోడల్ గేట్లు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని టీకాస్ గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంది. కాపలా లేని రైల్వే గేట్ వద్ద రైలు వస్తుండగా కి.మీ.దూరం నుంచే హుటర్ (శబ్దం చేసే యంత్రం) సైరన్ మోగిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. రైల్వే వంతెనలు, ట్రాక్ పనులు, మలుపుల వద్ద రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. టీకాస్ వ్యవస్థ మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ట్యాగ్, రేడియో కమ్యూనికేషన్ యాంటీనాపై పనిచేస్తుంది. ఎదురుగా మరో రైలు ఉన్నప్పుడు 200 కి.మీ. రైలు వేగాన్ని కూడా టీకాస్ నియంత్రిస్తుంది. గేట్ వార్నింగ్.. 2 కి.మీ. దూరంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ సమాచారాన్ని డ్రైవర్‌కు అందజేసి అప్రమత్తం చేస్తుంది. ఒక వేళ గేట్ వద్ద వాహనం ఆగిపోతే డ్రైవర్ స్వయంగా రైలును ఆపి ప్రమాదాన్ని నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. క్యాప్ సిగ్నల్ వ్యవస్థ.. పొగ మంచు తదితర కారణాల రీత్యా అప్రోచ్ సిగ్నల్ గురించి ముందుగానే డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, డబుల్ పసుపు సిగ్నల్ ఎంత దూరంలో ఉందో డ్రైవర్‌కు తెలియజేస్తుంది. సిగ్నల్ బల్బులు వెలగకపోయినా, ఎవరైనా ధ్వంసం చేసినా, మంచు కారణంగా సిగ్నల్స్ కనిపించకపోయినా అప్రమత్తం చేస్తుంది. ఇంజిన్‌లోని డ్రైవర్ మిషన్ ఇంటర్ఫేస్ మానిటర్లో సిగ్నల్ ఇండికేటర్స్‌ను చూపిస్తుంది. మూవ్మెంట్ అథారిటీ.. పసుపు, డబుల్ పసుపు సిగ్నల్స్ దాటిన తర్వాత రెడ్ సిగ్నల్ ఎంత దూరంలో ఉందో ఇంజిన్‌లోని ఇంటర్ఫేస్ మానిటర్ ద్వారా తెలియజేస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఆటోమెటిక్‌గా రైలును ఆపుతుంది. రేడియో కమ్యూనికేషన్ యాంటీనా.. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసే టీకాస్ పరికరం స్టేషన్ పరిధిలోని 5 నుంచి 10 కి.మీ పరిధిలో ఏ ట్రాక్‌లో రైలు ఆగి ఉంది. ఏ ట్రాక్‌లో రైలు వస్తోంది.. వెళ్తోంది తదితర సమాచారాన్ని రైలు ఇంజిన్‌లోని టీకాస్‌కు రేడియో కమ్యూనికేషన్ యాంటీనా ద్వారా అందజేస్తుంది. ఒకవేళ స్టేషన్ మాస్టర్ పొరపాటున ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లకు సిగ్నల్ ఇచ్చినా రైలు ఇంజిన్‌లోని టీకాస్, స్టేషన్‌లోని టీకాస్‌లు అనుసంధానమై రైళ్లు ఢీకొట్టకుండా ప్రమాదాన్ని నివారిస్తాయి. ప్రతి రెండు నిమిషాలకొకసారి ఇంజిన్‌లోని టీకాస్, స్టేషన్‌లోని టీకాస్‌లు అనుసంధానమవుతూ రైళ్ల రాకపోకల సమాచారాన్ని అందజేసుకుంటాయి. ఆర్ఎఫ్ ట్యాగ్.. రైలు పట్టాల మధ్య రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ట్యాగ్ ఉంటుంది. ఒక వేళ రైలు డీరెల్మెంట్(పడిపోయినప్పుడు) అయితే ఇంజిన్‌లోని టీకాస్ ప్రమాదస్థలి సమాచారాన్ని ఇవ్వడంతోపాటు ఆ మార్గంలో వచ్చే రైళ్ల డ్రైవర్లకు సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తూ ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. ఈ విధానం ద్వారా రైలు ఎక్కడ ఉందనే సమాచారాన్ని ఇంజిన్‌లోని టీకాస్ సేకరించి స్టేషన్‌లోని టీకాస్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. -
రెండు రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం
గుత్తి: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కాచిగూడ (12798) వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి 12 గంటలకు గుత్తి జంక్షన్ పరిధిలోని జూటూరు–రాయలచెరువు స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో దొంగల గుంపు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ కనిపించక లోకో పైలెట్ రైలును నిలిపి వేశాడు. వెంటనే సుమారు 10 నుంచి 15 మంది దుండగులు రైల్లోకి చొరబడ్డారు. ఎస్–10, 11, 12 ఏసీ బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను కొట్టి, మారణాయుధాలు చూపి బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. సుమారు అరగంట పాటు దుండగులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ సమయంలో యర్రగుంట్లకు చెందిన ఇద్దరు జీఆర్పీ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నా దొంగలను నిలువరించలేకపోయారు. ఆ తర్వాత గంటకే గుత్తికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (నిజామబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు నం.12794)లో కూడా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే దొంగలు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపేశాడు. ఆ వెంటనే దొంగలు ఎస్–4, 5, 6, 12 బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ బేగం బజారుకు చెందిన ప్రయాణికులు చంద్రమోహన్, జయప్రకాశ్, నాందేడ్‌కు చెందిన నితిన్ ఎరివార్, ఫాతిమా, రేష్మా గుత్తి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీపై కొందరు ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు ఉన్నా దోపిడీ దొంగలను నిలువరించలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా బేగంబజార్‌కు చెందిన రేష్మా(23) మెడలోంచి 11 తులాలు, నాందేడ్‌కు చెందిన మయూరి వద్దనుంచి 1 తులం, కడపకు చెందిన ఫాతీమా వద్ద బ్యాగులో నుంచి రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగగానే శుక్రవారం వారు రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడలో చైన్ లాక్కెళ్లారు అర్ధరాత్రి సమయం కావడంతో నాతో పాటు ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నాం. దొంగలు దొంగలు అనే అరుపులు వినిపించడంతో ఉలిక్కి పడి లేచాను. అప్పటికే దొంగలు నా ముందు నిలబడి ఉన్నారు. మెడలోని చైన్ లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు. – జయప్రకాశ్, హైదరాబాద్ చంపుతామని బెదిరించారు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నాను. కాపాడండీ కాపాడండీ అంటూ అరుపులు వినిపించాయి. లేచి చూసే సరికి సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. చంపుతారని భయపడ్డా. వెంటనే నా ఉంగరం, వాచీ, కొంత నగదు దొంగలకు ఇచ్చేశాను. – చంద్రమోహన్, హైదరాబాద్ -
సిగ్నలింగ్ పనుల్లో జాగ్రత్త అవసరం
రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్ సాక్షి, హైదరాబాద్: రైల్వేలో సిగ్నలింగ్, టెలికం వ్యవస్థల లక్ష్యం భద్రతే అరుునందున దానికి సంబంధించిన పనులను జాగ్రత్తగా నిర్వహించాలని రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ (సిగ్నల్, టెలికం) అఖిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ పనులు ప్రామాణికంగా ఉంటున్నాయా? లేదా? అన్న విషయాన్ని బాధ్యులైన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఆదివారం రైల్ నిలయంలో అఖిల భారత రైల్వే సిగ్నల్, టెలికం ఇంజనీర్ల సమావేశంలోనూ.. అలాగే తార్నాకలోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్స(ఇరిసెట్) 59వ వార్షికోత్సవంలోనూ అఖిల్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైల్వే రవాణాలో కీలక మార్పులు తేవడంలో ఇరిసెట్ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. సిగ్నలింగ్ వ్యవస్థ మరింత పటిష్టమైన సేవలు అందించేందుకు కావాల్సిన నిపుణులకు తర్ఫీదును ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషిస్తోందన్నారు. 1957లో ప్రారంభమైన ఇరిసెట్ ఇప్పటి వరకు సుమారు 7,260 మందికి సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో శిక్షణ ఇచ్చిందన్నారు. ఇక్కడ 121 కోర్సుల్లో శిక్షణ ఇస్తూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో నూతన మార్పులకు ఇరిసెట్ శ్రీకారం చుట్టిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఇరిసెట్ సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇరిసెట్ సావనీర్‌ను విడుదల చేశారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించిన 18 మంది అధికారులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో రైల్వే బోర్డు అదనపు సభ్యుడు(సిగ్నలింగ్) కాశీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అరవింద్ మిట్టల్, గోయల్, శోభన్ చౌదరి, సునీల్‌గుప్తా, ఇరిసెట్ డెరైక్టర్ ఎంఎస్ మహబూబ్అలీ తదితరులు పాల్గొన్నారు.