న్యూఢిల్లీ : స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే వాడాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే దిగుమతులను సంపూర్ణంగా తగ్గించిందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. చైనాకు చెందిన సంస్థ నుంచి సిగ్నలింగ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక రైల్వేలో దిగుమతులు సున్నా స్థాయికి చేరుకున్నాయని యాదవ్ చెప్పారు. రైల్వేలలో దిగుమతుల్ని నిలిపివేయడమే కాకుండా, రైల్వే ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే టెండర్లకు ఇక స్వదేశీ సంస్థలకే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. రైల్వేలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా కంపెనీలపై నిషేధం విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అధిక భాగం స్వదేశీ బిడ్డర్లకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గత రెండు, మూడేళ్లుగా దిగుమతుల్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment