పట్టాలెక్కని ‘టీకాస్‌’! | TCAS Is Testing Successful But Not Implemented | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని ‘టీకాస్‌’!

Published Tue, Nov 12 2019 2:33 AM | Last Updated on Tue, Nov 12 2019 5:14 AM

TCAS Is Testing Successful But Not Implemented - Sakshi

తాండూరు : అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రెయిన్‌ కొలిజెన్‌ అవాయిడింగ్‌ సిస్టం (టీకాస్‌)ను రైల్వే శాఖ అమలు చేసి ఉంటే సోమవారం హైదరాబాద్‌లో ఒకే ట్రాక్‌పై ప్రయాణించిన రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా లేదా వెనుక నుంచి రైళ్లు ఢీకొని సంభవించే ప్రమాదాలను నివారించే టీకాస్‌ సాంకేతికతను గతంలోనే రైల్వే శాఖ విజయవంతంగా ప్రయోగించింది. భారతీయ రైల్వే వ్యవస్థకు అనుగుణంగా రూపొందించిన ఈ టీకాస్‌ను రెండేళ్ల క్రితమే అమల్లోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ పరిజ్ఞానాన్ని పట్టాలెక్కించడంపై పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నో సదుపాయాలతో రూపొందించిన టీకాస్‌ అమలుపై ఇటు రైల్వే శాఖ గానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో తరచూ రైలు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.   

మూడు జంక్షన్ల మధ్య ప్రయోగాలు.. 
యూరప్‌ దేశాల్లో అమల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మించి భారత రైల్వే పరిశోధన సంస్థ(ఆర్డీఎస్వో) రూపొందించిన డిజైన్‌తో కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్‌ కంపెనీల ఆధ్వర్యంలో 2012 నుంచి 2014లో ఏడాదిన్నరపాటు సుమారు రూ.40 కోట్ల వ్యయంతో వికారాబాద్‌–వాడీ, వికారాబాద్‌–బీదర్, వికారాబాద్‌–లింగంపల్లి జంక్షన్ల మధ్య రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాలు జరగకుండా వివిధ అంశాల్లో టీకాస్‌ ప్రయోగాలు చేశారు. మూడు జంక్షన్ల మధ్య కర్నెక్స్, మేధా, హెచ్‌బీఎల్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన టీకాస్‌ సాంకేతిక పరికరాల అనుసంధాన ప్రక్రియ ముగిసింది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ అధికారులు గతంలోనే ప్రకటించారు. 

కర్ణాటక సరిహద్దులో ప్రయోగాలు.. 
వికారాబాద్‌ జిల్లా తాండూరు–బషీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న కర్ణాటక సరిహద్దులోని మంతట్టి, నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో చేసిన టీకాస్‌ ప్రయోగాలను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు చైర్మన్, సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు కంపెనీల సాంకేతిక పరికరాల మధ్య అనుసంధానం ప్రక్రియ ముగిసిన తక్షణమే బోర్డు, ప్రభుత్వం అనుమతితో ఏడాదిలోపు టీకాస్‌ను అమల్లోకి తెస్తామని ప్రకటించారు.  

బ్లాక్‌బాక్స్‌ తరహాలో.. 
రైలు ఇంజిన్‌లో ఏర్పాటు చేసే టీకాస్‌ బాక్స్‌ను విమానాల్లో ఉపయోగించే బ్లాక్‌బాక్స్‌ తరహా ప్రమాణాలతో తయారు చేశారు. రైలు ప్రమాదానికి గురైనా అందులోని టీకాస్‌ బాక్స్‌ దెబ్బతినకుండా పనిచేస్తూ, ఆ మార్గంలో వచ్చే ఇతర రైళ్లు ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రైల్వే లెవల్‌ క్రాసింగ్‌(గేట్‌)లు, మోడల్‌ గేట్‌లు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని టీకాస్‌ గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంది. కాపలా లేని రైల్వే గేట్‌ వద్ద రైలు వస్తుండగా కి.మీ.దూరం నుంచే హుటర్‌ (శబ్దం చేసే యంత్రం) సైరన్‌ మోగిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. రైల్వే వంతెనలు, ట్రాక్‌ పనులు, మలుపుల వద్ద రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. టీకాస్‌ వ్యవస్థ మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్‌) ట్యాగ్, రేడియో కమ్యూనికేషన్‌ యాంటీనాపై పనిచేస్తుంది. ఎదురుగా మరో రైలు ఉన్నప్పుడు 200 కి.మీ. రైలు వేగాన్ని కూడా టీకాస్‌ నియంత్రిస్తుంది. 

గేట్‌ వార్నింగ్‌.. 
2 కి.మీ. దూరంలోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ సమాచారాన్ని డ్రైవర్‌కు అందజేసి అప్రమత్తం చేస్తుంది. ఒక వేళ గేట్‌ వద్ద వాహనం ఆగిపోతే డ్రైవర్‌ స్వయంగా రైలును ఆపి ప్రమాదాన్ని నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. 

క్యాప్‌ సిగ్నల్‌ వ్యవస్థ.. 
పొగ మంచు తదితర కారణాల రీత్యా అప్రోచ్‌ సిగ్నల్‌ గురించి ముందుగానే డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, డబుల్‌ పసుపు సిగ్నల్‌ ఎంత దూరంలో ఉందో డ్రైవర్‌కు తెలియజేస్తుంది. సిగ్నల్‌ బల్బులు వెలగకపోయినా, ఎవరైనా ధ్వంసం చేసినా, మంచు కారణంగా సిగ్నల్స్‌ కనిపించకపోయినా అప్రమత్తం చేస్తుంది. ఇంజిన్‌లోని డ్రైవర్‌ మిషన్‌ ఇంటర్‌ఫేస్‌ మానిటర్‌లో సిగ్నల్‌ ఇండికేటర్స్‌ను చూపిస్తుంది. మూవ్‌మెంట్‌ అథారిటీ.. పసుపు, డబుల్‌ పసుపు సిగ్నల్స్‌ దాటిన తర్వాత రెడ్‌ సిగ్నల్‌ ఎంత దూరంలో ఉందో ఇంజిన్‌లోని ఇంటర్‌ఫేస్‌ మానిటర్‌ ద్వారా తెలియజేస్తుంది. డ్రైవర్‌ అప్రమత్తంగా లేకపోతే ఆటోమెటిక్‌గా రైలును ఆపుతుంది. 

రేడియో కమ్యూనికేషన్‌ యాంటీనా.. 
రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే టీకాస్‌ పరికరం స్టేషన్‌ పరిధిలోని 5 నుంచి 10 కి.మీ పరిధిలో ఏ ట్రాక్‌లో రైలు ఆగి ఉంది. ఏ ట్రాక్‌లో రైలు వస్తోంది.. వెళ్తోంది తదితర సమాచారాన్ని రైలు ఇంజిన్‌లోని టీకాస్‌కు రేడియో కమ్యూనికేషన్‌ యాంటీనా ద్వారా అందజేస్తుంది. ఒకవేళ స్టేషన్‌ మాస్టర్‌ పొరపాటున ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లకు సిగ్నల్‌ ఇచ్చినా రైలు ఇంజిన్‌లోని టీకాస్, స్టేషన్‌లోని టీకాస్‌లు అనుసంధానమై రైళ్లు ఢీకొట్టకుండా ప్రమాదాన్ని నివారిస్తాయి. ప్రతి రెండు నిమిషాలకొకసారి ఇంజిన్‌లోని టీకాస్, స్టేషన్‌లోని టీకాస్‌లు అనుసంధానమవుతూ రైళ్ల రాకపోకల సమాచారాన్ని అందజేసుకుంటాయి. 

ఆర్‌ఎఫ్‌ ట్యాగ్‌.. 
రైలు పట్టాల మధ్య రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్‌) ట్యాగ్‌ ఉంటుంది. ఒక వేళ రైలు డీరెల్‌మెంట్‌(పడిపోయినప్పుడు) అయితే ఇంజిన్‌లోని టీకాస్‌ ప్రమాదస్థలి సమాచారాన్ని ఇవ్వడంతోపాటు ఆ మార్గంలో వచ్చే రైళ్ల డ్రైవర్లకు సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తూ ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. ఈ విధానం ద్వారా రైలు ఎక్కడ ఉందనే సమాచారాన్ని ఇంజిన్‌లోని టీకాస్‌ సేకరించి స్టేషన్‌లోని టీకాస్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement