వివాహేతర సంబంధం..రౌడీషీటర్‌ హత్య | Rowdy Sheeter Murder Case Revals PSR Nellore Police | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ హత్యకేసులో నిందితుల అరెస్ట్‌

Published Wed, Jun 27 2018 11:55 AM | Last Updated on Wed, Jun 27 2018 11:55 AM

Rowdy Sheeter Murder Case Revals PSR Nellore Police - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ, చిత్రంలో నిందితులు (ముసుగు ధరించిన వ్యక్తులు

నెల్లూరు(క్రైమ్‌): వివాహేతర సంబంధం నేపథ్యంలో రౌడీషీటర్‌ బస్టాండు సాయిని హత్యచేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. స్థానిక ఉడ్‌హౌస్‌సంఘంకు చెందిన కోడూరు సాయికుమార్‌ అలియాస్‌ బస్టాండు సాయి (22), వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన ఉడత గణేష్‌కుమార్‌ అలియాస్‌ గని, కామాటివీధి కృష్ణమందిరానికి చెందిన దువ్వూరు అమర్‌నాథ్‌ అలియాస్‌ అమర్‌లు స్నేహితులు. సాయి, గణేష్‌లు పలు కేసుల్లో నిందితులు. గణేష్‌ జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన పండు అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. గణేష్‌కు తెలియకుండా కొంతకాలంగా సాయి సైతం ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తర్వాత ఈ విషయం గనికి తెలియడంతో అప్పటినుంచి సాయిపై అతను కక్ష పెంచుకున్నాడు. సాయి పలుమార్లు తాను చెప్పినట్లు వినాలని లేకుంటే అంతు చూస్తామని గని, అమర్‌నాథ్‌లపై దాడిచేయడంతో వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా సాయిని అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నారు.

పరారవుతుండగా..
ఈనెల 16వ తేదీన సాయితో కలిసి గని, అమర్‌నాథ్, మరో వ్యక్తి రమేష్‌లు వెంకటేశ్వరపురంలోని సప్తగిరి బార్‌లో ఫూటుగా మద్యం సేవించారు. అనంతరం తమవెంట తెచ్చుకున్న కత్తులతో గణేష్, అమర్‌నాథ్‌లు విచక్షణారహితంగా సాయిని పొడిచారు. బీర్‌బాటిళ్లతో తలపై కొట్టడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతుడి తల్లి వేళాంగిణి ఫిర్యాదు మేరకు అప్పటి ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ జి.సంగమేశ్వరరావు హత్యకేసు నమోదుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం గని, అమర్‌నాథ్‌లు జనార్ధన్‌రెడ్డికాలనీలో ఉన్నారనే సమాచారం ఇన్‌స్పెక్టర్‌ సంగమేశ్వరరావుకు అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంటున్న తరుణంలో పోలీసులను చూసిన నిందితులు పరారవుతుండగా వెంబడించి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్‌చేశారు. మరో నిందితుడు రమేష్‌ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ (రెండోనగర ఇన్‌చార్జి) జి.సంగమేశ్వరరావు, రెండోనగర ఎస్సైలు ప్రతాప్, పి.వి.రమణయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement