వెలుగులోకి వస్తున్న సంపత్‌ వ్యవహారాలు | Sampath Nehra Crimes Reveals | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఉన్నా.. అక్కడ దందా!

Published Thu, Jun 6 2019 8:07 AM | Last Updated on Thu, Jun 6 2019 8:07 AM

Sampath Nehra Crimes Reveals - Sakshi

సంపత్‌ నెహ్రా (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లోని మియాపూర్‌ ఠాణా పరిధిలోని గోకుల్‌ ప్లాట్స్‌లో మకాం వేసి... సుదీర్ఘకాలం తర్వాత హర్యానా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి... ఇటీవల తీహార్‌ జైలు నుంచి చంఢీగడ్‌ చేరిన ఘరానా గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతడికి కస్టడీలోకి తీసుకున్న చంఢీగడ్‌ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌నూ టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాదిలోని పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారి, సైబరాబాద్‌లో తలదాచుకున్న నెహ్రా ఇక్కడ ఉన్నప్పుడూ యథేచ్చగా అక్కడ దందాలు  సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. చంఢీగడ్‌లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడని అక్కడి పోలీసులు గుర్తించారు. తన స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ పోలీసు నిఘాకు చిక్కికుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేల్చారు.

సంపత్‌ ప్రధానంగా చంఢీగడ్‌లోని మొహాలీతో పాటు పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన రామ్‌దీప్‌ సింగ్, శుభ్‌నవ్‌దీప్‌ సింగ్, జస్పీత్‌ సింగ్, గుర్వీందర్‌ సింగ్‌లను తన ప్రధాన అనుచరులుగా ఏర్పాటు చేసుకున్న అతను ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన దినేష్‌ కుమార్‌ ఆర్మీలో పని చేసేవాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్‌ ప్రత్యేకమైన పనుల కోసం మాత్రమే అతడిని రంగంలోకి దింపేవాడు. మాదాపూర్‌లో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి సాధారణ జీవితం గడిపిన సంపత్‌ నిత్యం సెల్‌ఫోన్‌లో చాటింగ్స్, కాల్స్‌తో బిజీగా ఉండే వాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బంది పోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్‌ సైతం చేయించాడు. ఇందుకుగాను తన నలుగురు అనుచరులకూ ఆయుధాలు కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్‌ అనే యువకుడిని కిడ్నాప్‌ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. ఇతడి అనుచరులను చంఢీగడ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ ఉద్యోగి దినేష్‌ సింగ్‌ సెలవు పెట్టివచ్చి సంపత్‌ చెప్పిన పనులు చేసేవాడు. ఘరానా గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అనుచరుడిగా పని చేసిన సంపత్‌ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement