సల్మాన్‌ ఖాన్‌ చిక్కాడు | Interstate Thief Salman Khan Arrested in Delhi | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ చిక్కాడు

Published Wed, Sep 25 2019 10:47 AM | Last Updated on Wed, Sep 25 2019 10:47 AM

Interstate Thief Salman Khan Arrested in Delhi - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీలోని భజన్‌పుర ప్రాంతానికి చెందిన అతడి పేరు సల్మాన్‌ఖాన్‌.. ఘరానా నేరచరితుడైన ఇతడిపై మూడు రాష్ట్రాల్లో కేసులున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో స్నాచింగ్స్, చోరీ నేరాలు చేశాడు. మూడు నెలల క్రితం నగరంలోని కోర్టులో హాజరు పరిచి తీసుకువెళ్తుండగా ఆగ్రాలో తప్పించుకున్నాడు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. 31 కేసుల్లో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌.. పోలీసు కస్టడీకి నుంచి తప్పించుకున్న తర్వాత మరో 15 నేరాలు చేసినట్లు వెల్లడైంది. భజన్‌పురాలోని నూర్‌ ఇల్లాహి ప్రాంతానికి చెందిన సల్మాన్‌ గడిచిన కొన్నేళ్ళుగా నేరాలు చేస్తున్నాడు. 2003లో ఓ చోరీ కేసులో తొలిసారిగా ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. అప్పగి నుంచి ఆ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, తెలంగాణలోనూ నేరాలకు పాల్పడ్డాడు. ఇతడి పళ్లు కొన్ని విరిగి ఉండటంతో ఢిల్లీ పోలీసులు ‘దంత్‌ తూటా’గా పిలుస్తుంటారు. 2017 జూలైలో నగరంపై కన్నేసిన ఇతడు హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో పంజా విసిరాడు. మలక్‌పేట, పంజగుట్ట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో చోరీలు, స్నాచింగ్స్‌కు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ఇతడిని పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై ఢిల్లీలోనూ కేసులు ఉండటంతో అక్కడి పోలీసులు ట్రాన్సిట్‌ వారెంట్‌పై తీసుకువెళ్లి సుదీర్ఘకాలం తీహార్‌ జైల్లో ఉంచారు. అయితే, నగరంలో నమోదైన కేసుల విచారణ కోసం ఇక్కడి పోలీసులు సల్మాన్‌ను తీసుకుచ్చారు. కొన్నాళ్ళు నగరంలోని జైల్లోనే ఉన్న ఇతగాడికి ఈ ఏడాది జూన్‌ 11న ఢిల్లీ తీసుకువెళ్ళడానికి అక్కడి పోలీసులు వచ్చారు.

సల్మాన్‌ను కస్టడీలోకి తీసుకుని కానిస్టేబుల్‌ ప్రదీప్‌ నేతృత్వంలోని బృందం దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి తీసుకెళుతుండగా జూన్‌ 12న తెల్లవారుజామున చేతికున్న బేడీలను చాకచక్యంగా తీసేసుకుని పోలీసులు అప్రమత్తమయ్యే లోపే ఆగ్రా కంటోన్మెట్‌ స్టేషన్‌కు 10 కిమీ దూరంలో ఉన్న భండాయ్‌ ప్రాంతంలో రైలు నుంచి దూకేసి గుర్గావ్‌కు పారిపయోడు. అక్కడ మారుపేరుతో అక్కడి ఖోడాకాలనీలో అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. సల్మాన్‌ తప్పించుకోవడంపై ఆగ్రా కంటోన్మెంట్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఈ ఘరానా నేరగాడికి పట్టుకోవడానికి అక్కడి స్పెషల్‌ సెల్‌ రంగంలోకి దిగింది. ఇతడికి ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో అనేక అడ్డాలు ఉన్నట్లు గుర్తించింది. సల్మాన్‌ ఆదివారం తన అనుచరుడిని కలవడానికి అక్షర్‌ధామ్‌ దేవాలయం వద్దకు వస్తున్నట్లు స్పెషల్‌సెల్‌కు సమాచారం అందడంతో వలపన్నిన ప్రత్యేక బృందం సల్మాన్‌ఖాన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా తన వద్ద ఉన్న తుపాకీ గురిపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. చాకచక్యంగా అతడిని పట్టుకున్న పోలీసులు తుపాకీ, మూడు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత ధనిష్, హసన్, సోహైల్‌లను అనుచరులుగా చేసుకున్నాడు. ఈ నలుగురూ కలిసి ఢిల్లీ చుట్టు పక్కల 15 దోపిడీలు, స్నాచింగ్స్, చోరీలు చేసినట్లు వెల్లడైంది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని కేసుల విచారణ నిమిత్తం సల్మాన్‌ఖాన్‌ను మరోసారి ఇక్కడకు తీసుకువరావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.  

సిటీలో చేసిన నేరాలివీ..
2017 జూలై 22: శివరాంపల్లిలోని ఎన్‌పీఏ కాలనీకి చెందిన పి.మహేశ్వరి సాయంత్రం తన కుమార్తెతో మార్కెట్‌కు వెళ్తుండగా తన అనుచరుడితో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చిన సల్మాన్‌ఖాన్‌ మహేశ్వరి మెడలోని ఆరు తులాల పుస్తెలతాడు లాక్కుపోయాడు.
2017 జూలై 24: సరూర్‌నగర్‌ పరిధిలోని కమలానగర్‌కు చెందిన లెక్చరర్‌ అపర్ణ చతుర్వేది ఉదయం చైతన్యపురి బస్టాప్‌ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా మరో నిందితుడితో కలిసి దూసుకువచ్చిన సల్మాన్‌ ఖాన్‌ ఆమె మెడలో ఉన్న రూ.80 వేల విలువైన బంగారు గొలుసు స్నాచింగ్‌ చేశాడు.
అదే రోజు: చైతన్యపురి బస్టాప్‌ వద్ద ఈ నేరం చేసిన తర్వాత సాయిబాబా దేవాలయం వైపు దూసుకుపోయిన సల్మాన్‌ ద్వయం 20 నిమిషాల వ్యవధిలో మలక్‌పేటలోనూ పంజా విసిరింది. సలీంనగర్‌కు చెం దిన కె.రత్నకుమారి ముసరాంబాగ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉండగా ఆమె మెడలోని మూడు తులాల బంగా రు గొలుసు లాక్కుపోయారు.  
25 జూలై 2017: అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఓ ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ను సల్మాన్‌ ద్వయం చోరీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement