సల్మాన్‌ఖాన్, సంపత్ నెహ్రా
సాక్షి, సిటీబ్యూరో: కేవలం 26 ఏళ్ల వయస్సుకే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారి, రెండేళ్ల క్రితం సైబరాబాద్‌లో చిక్కిన ఘరానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాను తాజాగా చండీఘడ్ చేరాడు. తీహార్ జైల్లో ఉన్న అతడిని అక్కడ నమోదైన హత్యాయత్నం కేసులో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లారు. 2017 జూన్ 7న మియాపూర్‌లో అరెస్టైనప్పటి నుంచి సంపత్ నెహ్రాను ఏదో ఒక నగర, జిల్లా పోలీసులు ‘తీసుకువెళ్తూ’ తమ కేసుల్లో అరెస్టు చేస్తూనే ఉన్నారు. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కే వార్నింగ్ ఇచ్చిన సంపత్ పేరు ఉత్తరాదిలో మారుమోగింది. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ తండ్రి రామ్ చందర్ చండీఘడ్‌కు వలస వెళ్లి అక్కడ పోలీసు విభాగంలో ఎస్‌ఐగా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. సంపత్ పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ చదివాడు. ఆ దశలోనే వర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అనుచరుడిగా పని చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడంతో తానే ఓ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. యువత, విద్యార్థులతో భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న సంపత్ తన సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకూ విస్తరించాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు.
పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రతి నేరంలోనూ తుపాకీ వినియోగించిన సంపత్ డబుల్ హ్యాండ్ షూటర్. అతను రెండు చేతులతోనూ ఏక కాలంలో తుపాకీ పేల్చగలడు. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పోలీసుల అదుపులోకి తీసుకున్న తన అనుచరుడు దీపక్ అలియాస్ టింకును విడిపించే ప్రయత్నంలో సంపత్ పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎస్కార్ట్ అధికారుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు కాల్పులు జరిపి తన అనుచరుడిని తప్పించాడు. రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన సంపత్ అతడిని హత్య చేశాడు. మూడు రాష్ట్రాల్లోనూ అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో చండీఘర్‌కు పారిపోయిన సంపత్ అక్కడి ఖోర్బా ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆపై సైబరాబాద్‌కు వచ్చిన సంపత్ మియాపూర్ పరిధిలోని గోకుల్‌ప్లాట్స్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. ఇతడి కదలికలను గుర్తించిన హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు 2017 జూన్ 7న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసుల సాయంతో అతడిని అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సంపత్‌ను 2016లో చండీఘడ్‌లో నమోదైన సందీప్‌సింగ్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో అక్కడి పోలీసులు పీటీ వారెంట్‌పై గత వారం తీసుకువెళ్లారు. ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న సంపత్ నెహ్రా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టలేదు. ఆయన నుంచి డబ్బు వసూలు చేయడానికి పథకం వేసి వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో రాజస్థాన్ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రధానంగా సోషల్‌మీడియా వేదికగానే ఇతడి దందాలు నడిచాయి. జోధ్‌పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ 2016లో సల్మాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. సంపత్‌కు రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిని హత్య చేసిన చరిత్ర ఉండటంతో ఈ వార్నింగ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే వారు.
Comments
Please login to add a commentAdd a comment