టీ.నగర్: లైంగిక ఆరోపణలకు గురైన ప్రొఫెసర్ నిర్మలాదేవి వద్ద ప్రత్యేక విచారణ అధికారి సంతానం గురువారం విచారణ జరిపారు. అరుప్పుకోటై దేవాంగ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయిత్నంచినట్టు వచ్చిన ఆరోపణలు తెలిసిందే. దీనికి సంబంధించి ఆడియో టేపులు విడుదల కావడంతో నిర్మలాదేవిని అరెస్టు చేసి ఆమె వద్ద సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజులుగా విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఏకసభ్య విచారణ అధికారి సంతానం ఇది వరకే మదురై అరుప్పుకోటై ప్రాంతాల్లో ప్రాథమిక విచారణ జరిపారు.
బుధవారం ఆయన రెండవ విడత విచారణను ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా పేర్కొనబడుతున్న నిర్మలాదేవి వద్ద సమగ్ర విచారణ జరిపేందుకు సంతానం నిర్ణయించారు. ఇందుకోసం మదురై సెంట్రల్ జైల్లో ఉన్న నిర్మలాదేవిని నేరుగా కలుసుకునేందుకు జైలు అధికారుల అనుమతి కోరారు. దీంతో అనుమతి లభించడంతో గురువారం ఉదయం సంతానం మదురై సెంట్రల్‌జైలుకు నేరుగా వెళ్లి నిర్మలాదేవి వద్ద విచారణ జరిపారు. ఆయనతో పాటు ప్రొఫెసర్లు కమలి, త్యాగేశ్వరి వెంట వెళ్లారు. శుక్రవారం సంతానం అరుప్పుకోటై కళాశాల నిర్వాహకులు, విద్యార్థినుల వద్ద విచారణ జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment