
కారును రివర్స్ చేయడంతో పాఠశాల గోడను చీల్చుకొని లోనికి దూసుకెళ్లిన కారు
గంజాయి వ్యాపారుల దందా పరాకాష్టకు చేరింది. కారులో సరకును దాచిన విషయం బయటపడుతుందన్న భయంతో వేగంగా కారును వెనక్కుతిప్పడంతో.. కొయ్యూరు మండలం గదబపాలెం ప్రాథమిక పాఠశాలలోకి దూసుకుపోయింది. దీంతో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేశారు. అదృష్టవశాత్తూ గోడ అడ్డుగా నిలవడంతో చిన్నారులకు పెద్ద ప్రమాదం తప్పింది.
విశాఖపట్నం , కొయ్యూరు: బడి అప్పుడే మొదలైంది. విద్యార్థులు పుస్తకాలు చేతబట్టి ఉపాధ్యాయుడి పాఠాలు వింటున్నారు. అంతలోనే పెద్ద శబ్దం. పాఠశాల గోడను ఢీకొట్టి లోనికి దూసుకొచ్చిన కారు విధ్వంసం సృష్టించింది. కారు రివర్స్‌గేర్ వేసి లాగించడంతో పాఠశాల వెనక గోడ పడిపోయింది. గోడను ఆనుకుని ఉన్న ఏడుగురు విద్యార్థులపై గోడపెచ్చులు పడిపోయాయి. వారికి గాయాలు కావడంతో వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు స్వల్పం కావడంతో ప్రాథమిక చికిత్స చేసి పాఠశాలకు తరలించారు.
ఇదీ అసలు విషయం..
చింతపల్లి ప్రాంతం నుంచి కారులో గంజాయి తరలిపోతున్నట్టు నర్సీపట్నం పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. పోలీసులు మాటు వేసిన సమాచారాం గంజాయి స్మగ్లర్లకు తెలిసిపోవడంతో నర్సీపట్నం వెళ్లకుండా కారును కొయ్యూరు మండలం మర్రిపాలెం నుంచి గదబపాలెం వరకు తీసుకువచ్చారు. అదే సమయంలో గంజాయి కారు గొలుగొండ వైపు వస్తున్నట్టుగా సమాచారం రావడంతో గొలుగొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి కారును ఎక్కడో దాచిన వ్యక్తులు బుధవారం ఉదయం గదబపాలెం పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. గ్రామస్తులకు అనుమానం వచ్చి కారు వద్దకు బయలుదేరారు. దీనిని గమనించిన స్మగ్లర్లు వెంటనే కారును తీయాలని భావించి రివర్స్‌గేర్ వేశారు. దీంతో పాఠశాల భవనం గోడ పడిపోయింది. గ్రామస్తులు దగ్గరకు వస్తే పట్టుకుంటారన్న భయంతో కారును వదిలిపెట్టి పారిపోయారు. ఆ కారు మరింత వెనక్కు వచ్చి ఉంటే విద్యార్థులను ఢీకొట్టి పెను ప్రమాదం జరిగివుండేది.
బీభత్సం.. గందరగోళం
హఠాత్తుగా ఈ విధ్వంసం చోటు చేసుకోవడంతో అందరూ పరుగులు తీశారు. స్థానికుల కథనం ప్రకారం గదబపాలెం పాఠశాల వద్దకు బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఏపీ31 బీఎస్ 3814 నెంబర్ కలిగిన కారు వచ్చింది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు రివర్స్‌గేర్ వేయడంతో వెనకనున్న పాఠశాల గోడను ఢీకొట్టింది. దీంతో గోడ పడిపోయింది. గోడను ఆనుకుని ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో దుండగులు కారును అక్కడ వదిలి పారిపోయారు. స్థానికులు సమాచారం ఎంఈవో బోడంనాయుడుకు అందించడంతో ఆయన హుటాహుటిన పాఠశాలకు వచ్చారు. గాయపడిన విద్యార్థులను వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తరువాత సమాచారం కొయ్యూరు పోలీసులకు అందజేశారు. పాఠశాల గోడను ఢీకొట్టి దుండగులు వదిలేసిన కారులో గంజాయి ఉన్నట్టుగా సమాచారం వచ్చిందని కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ బుధవారం సాయంత్రం తెలిపారు. దీనిపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయాలని ఎస్‌ఐను ఆదేశించామన్నారు. కారు ఎవరిది.. దానిని తీసుకువచ్చిన వ్యక్తులు ఎవరన్నది విచారణలో తేలుతుందన్నారు.