విజయ్ , విద్యార్థినికి రాసిన ప్రేమలేఖ
నిజామాబాదు,మద్నూర్(జుక్కల్): విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. ప్రేమలేఖలు రాశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మద్నూర్ మండలంలోని పెద్దఎక్లార గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు తుమ్‌వార్ విజయ్‌పై గురువారం గ్రామస్తులు దాడి చేశారు. పాఠశాలలోని పదో తరగతికి చెందిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాయడం, విషయం పెద్దవాళ్లకు తెలియడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయుడు విజయ్‌పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. అమ్మాయిలకు విద్యాబుద్ధులు నేర్పిస్తావని పాఠశాలకు పంపిస్తే లైంగిక వేధింపులకు గురిచేస్తావా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ఆవరణలోనే విజయ్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయుడు అతికష్టం మీద గ్రామస్తుల నుంచి విజయ్‌ను విడిపించి పాఠశాల కార్యాలయంలో కుర్చోబెట్టారు.
అనంతరం గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, ఇన్‌చార్జి ఎంఈవో రాములు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు విజయ్ గతంలో చాలాసార్లు ప్రేమ పేరుతో విద్యార్థినులను వేధించాడని, పలుమార్లు మందలించినా వినిపించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఎంఈవో డీఈవోతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించడంతో ఉపాధ్యాయుడు విజయ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. విజయ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పోలీసు వాహనం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిందితుడిని చితకబాదుతున్న గ్రామస్తులు, నిందితుడిని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులు
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. కాగా ఉపాధ్యాయుడు విజయ్‌ను గతంలో చాలాసార్లు సముదాయించినా వినిపించుకోలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుషాల్ తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో మరో విద్యార్థినికి ప్రేమలేఖ రాశాడని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థినులను బిచ్కుందలో సినిమాకు కూడా తీసుకెళ్లాడని వారు ఆరోపించారు. గతంలో మేనూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన విజయ్ అక్కడా విద్యార్థినులను వేధించాడని తెలిసింది. అలాగే మద్నూర్‌కు చెందిన విజయ్ అతని ఇంటివద్ద గల ఓ మహిళను లైంగికంగా వేధించడంతో గ్రామపెద్దలు పంచాయతీ పెట్టి లోలోపల సమస్యను పరిష్కరించినట్లు కాలనీవాసులు తెలిపారు. కాగా విజయ్ పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment