
సాక్షి, చెన్నై: సంతాన కోసం పూజలు చేద్దామని వచ్చిన భక్తురాలితో స్వామీజీ పరారైన ఘటన తమిళనాడులో జరిగింది. భర్త ఫిర్యాదు చేయడంతో విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి. తంజావూరు జిల్లా తిరువైయ్యారులోని ఇటుకల బట్టీ సమీపంలో బాలమురుగన్ అలియాస్ బాలసిద్దర్ (45) అనే వ్యక్తి 2014 నుంచి స్వామీజీగా చెలామణి అవుతున్నాడు. అమావాస్య రోజుల్లో అగ్నిగుండం వేసి పూజలు చేసేవాడు. ఈ మూడేళ్ల కాలంలో క్రమేణా ఆయన వద్దకు వచ్చే భక్తులు పెరిగారు. వీరిలో 11 మంది శిష్యులుగా మారారు.
కొందరు పోలీసు అధికారులు సైతం ఆయనను దర్శించుకుంటూ మఠానికి వసతి సౌకర్యాలు కల్పించేవారు. దేవుళ్ల శిలా విగ్రహాలను ప్రతిష్టించి స్వామికి సమర్పించారు. ఇదిలా ఉండగా, సంతాన లేమితో బాధపడుతున్న పల్లి అగ్రహారానికి చెందిన విజయకుమార్ అనే రైతు, ఆయన రెండో భార్య పునీత (41) తరచూ బాలసిద్ధర్ వద్దకు వచ్చేవారు. ప్రతిసారీ భర్తతో కలిసి వెళ్లే పునీత ఈనెల 21న ఒంటరిగా వెళ్లి స్వామిని దర్శించుకుంది. అయితే ఆ తరువాత ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యను వెతుక్కుంటూ విజయకుమార్ మఠానికి రాగా.. స్వామి కూడా కనిపించలేదు.
తన భార్యను స్వామి కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. బాలసిద్దర్ హిమాలయాలకు వెళ్లాడని, నవంబరు 2వ తేదీన మఠానికి చేరుకుంటాడని శిష్యులు పోలీసులకు చెప్పారు. పునీతతోపాటు పరారైన బాలసిద్దర్ నాగపట్నం వాసి. బీసీఏ చదివి బెంగళూరులోని ఒక ఐటీ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాడు. వివాహం అనంతరం ఓ కుమారుడు పుట్టిన కొంత కాలానికి సంసార జీవితంపై విరక్తిపుట్టిందని, దేవుడు తనను పిలుస్తున్నాడంటూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. బాలసిద్ధర్, పునీత ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.